దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరు కావడం కోసం ప్రస్తుతం బెయిల్ పై ఉండడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి అనుమతి పొందిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా అక్కడకు వెళ్ళకుండా, దారిలో లేకపోయినా లండన్ వెళ్లి, అక్కడ కొద్దిసేపు ఆగి, అక్కడ నుండి వెనుకకు వచ్చి దావోస్ వెళ్లడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. లండన్ లో ఆగితే కోర్టు అనుమతి ముందుగా ఎందుకు పొందలేదని ప్రశ్న తలెత్తుతుంది.
భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేకున్నా, లండన్ కంటే చాలా ముందే దావోస్ ఉన్నా, సీఎం ప్రయాణించే విమానం లండన్‌లో దిగిందని, దావోస్ బయలుదేరిన విమానం లండన్ లో ఎందుకు ల్యాండైందో తెలియడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక కార్యక్రమంలో లండన్ లో ఆడుతున్నట్లు లేదు.
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఇంధనం నింపుకోడానికి అనుకోకుండా ఆలస్యం అయిందని, అందువల్ల ముఖ్యమంత్రి అనుకోకుండా లండన్ వెళ్లి అక్కడ ఆగాల్సి వచ్చిందని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. పైగా, జూరెక్ విమానాశ్రయంలో రాత్రి 10 గంటల తర్వాత విమానాలు దిగడానికి అనుమతించారు కాబట్టి లండన్ లో ఆగవలసి వచ్చినదని సర్ది చెప్పుకొచ్చారు.
లండన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని కప్పిపుచ్చుకోడానికి మంత్రులతో అనేక అబద్ధాలు ఆడించి దొరికిపోయారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. లండన్ లో సొంత పనుల కోసం ఆగాలి అంటే కోర్ట్ అనుమతి లభించకపోవచ్చనే ఈ విధంగా `అనధికారికం’గా వెళ్లారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇస్తాంబుల్‌లో ఇంధనం నింపుకోడానికి విపరీత జాప్యం జరిగిందన్నది కూడా వాస్తవం కాదని చెబుతున్నారు. అక్కడ ఆగింది కేవలం రెండున్నర గంటలే. ఏ విమానానికైనా అంతే పడుతుంది. ఇస్తాంబుల్ నుంచి జూరెక్ విమాన ప్రయాణం వ్యవధి మూడు గంటలు. సాయంత్రం ఏడున్నర గంటలకు జూరెక్ చేరుకొనే అవకాశం ఉంది. రాత్రి పది గంటల వరకూ పట్టనే పట్టదు.
జూరెక్ విమానాశ్రయం రికార్డుల ప్రకారం ఆ రోజు రాత్రి పది గంటల తర్వాత కనీసం ఇరవై విమానాలు అక్కడ దిగాయి. ఆఖరి విమానం రాత్రి పదకొండున్నరకు దిగింది. జూరెక్ విమానాశ్రయంలో రద్దీ వల్ల ముఖ్యమంత్రి విమానం అక్కడ దిగలేక లండన్ వెళ్లిందన్న వాదన అర్థంలేదని స్పష్టం అవుతున్నది.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లండన్ వెళ్లి, అక్కడ ఆగి తన ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టుకోవాలన్నది ముందే జరిగిన నిర్ణయమని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆ వివరాలు వెల్లడించారు. ప్రత్యేక విమానంలో వెళ్తే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సమయంలో వస్తుందన్నది ముందుగానే సంబంధిత విమానాశ్రయానికి సమాచారం ఇవ్వాలని ఆయన గుర్తు చేసారు.
జగన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం లండన్ నుంచి 21వ తేదీ సాయంత్రం రాబోతోందని జూరెక్ విమానాశ్రయం అధికారులకు ఈ నెల 18వ తేదీనే సమాచారం ఇచ్చారని ఆయన చెబుతున్నారు. పైగా, రస్ అల్ ఖైమా దేశంతో జగన్‌కు ఆర్థిక వివాదాలు ఉన్నాయని, ఆయన వెళ్లిన సమయానికి ఆ దేశ ప్రతినిధులు లండన్‌లోనే ఉన్నారని, వారితో ఆ లావాదేవీలపై ఒక అవగాహనకు రావడానికే లండన్‌లో ఆగారని పట్టాభి ఆరోపించారు.
‘ఆ దేశంతో పెట్టుబడి పెట్టించి విశాఖ వద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టించారు. వ్యాన్‌పిక్ పేరుతో ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం కోసం ఆ దేశంతో పెట్టుబడి పెట్టించారు. భూ సేకరణలో కుంభకోణం జరిగి సీబీఐ కేసు నమోదైంది’ అని ఆయన గుర్తు చేశారు.
నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఈ వ్యవహారానికి సంబంధించి సెర్బియా దేశంలో అనేక నెలలపాటు నిర్బంధించారు. ఈ కేసులో కూడా జగన్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన లండన్ వెళ్లారు. నల్ల ధనం వ్యవహారాల్లో భాగంగానే ఆయన అక్కడకు వెళ్ళారని అప్పట్లో రాజకీయ పార్టీలు ఆరోపించాయి.
ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మళ్లీ లండన్ వెళ్లారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని పట్టాభి చెప్పారు. పైగా, ముఖ్యమంత్రితో పాటు దావోస్ సమావేశానికి హాజరవుతున్న అధికార ప్రతినిధివర్గం బృందం ఆయనతో ప్రత్యేక విమానంలో కాకుండా విడిగా దావోస్ కు చేరుకోవడం గమనార్హం.