బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్రను జూన్ నెల 23 నుండి జూలై 12 వరకు 20 రోజుల పాటు చేపట్టాలని నిర్ణయించారు. అట్లాగే 4వ విడత పాదయాత్రను సైతం ఆగస్టులోపు పూర్తి చేయనున్నారు. మొత్తంగా 3, 4 విడతల పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాదయాత్ర గురించి ప్రకటించారు. మొదటి, రెండో విడత పాదయాత్రల్లో భాగంగా బండి సంజయ్ 67 రోజులు పాదయాత్ర చేసి 828 కిలోమీటర్లు నడవడమే కాకుండా దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు.
రెండు విడతల పాదయాత్రలో భాగంగా 13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడవడంతో పాటు 66 సభలు నిర్వహించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, పార్లమెంట్ సమావేశాలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నందున, జాతీయ నాయకత్వం సూచన మేరకు ఇక నుంచి ప్రతినెలా 20 రోజుల పాటు పాదయాత్ర చేయాలని, మిగిలిన 10 రోజులు ఆయా కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.
‘‘2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం….. బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం…’’ అని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఇది తన మాట మాత్రమే కాదని… రాష్ట్ర ప్రజలంతా ఇదే మాట్లాడుకుంటున్నారని చెప్పారు.
2023లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది… టీఆర్ఎస్ కథ ముగుస్తుందని స్పషటం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనలపై మే 30 నుండి జూన్ 14 దాకా రాష్ట్రవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపిచ్చారు. వాటిని ఇంటింటికీ తీసుకెళ్లాలని చెప్పారు.
తెలంగాణలో బీజేపీకి లభిస్తున్న ప్రజా స్పందన చూశాక కేసీఆర్ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. గుణాత్మక మార్పు పేరుతో దేశమంతా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుతున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ తెరమరుగైందని, నాయకత్వలేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. జాతీయ సంఘటన సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభాపక్షనేత రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.