తెలంగాణ భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని చెబుతూ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం పలికిన బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘పట్టుదలకు తెలంగాణ ప్రజలు పెట్టింది పేరు’ అని కొనియాడుతూ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణ త్యాగాలు చేశారో.. ఆ ఆశయాలు ఇంకా నెరవేరలేదని పేర్కొన్నారు. కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన కారణంగా యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడం లేదని చెబుతూ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడమే తన సంకల్పమని స్పష్టం చేశారు.
తెలంగాణలో కుటుంబ పాలన చేసేవాళ్లు దేశ ద్రోహులంటూ మండిపడ్డారు. కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. తెలంగాణ వచ్చిన ప్రతీసారీ ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచారని ప్రధాని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల అభిమానం, ఆప్యాయతలకు రుణపడి ఉంటా అని పేర్కొన్నారు.
‘‘2013 సంవత్సరాన్ని నేను మరువలేను. అప్పుడు నేనొక సామాన్య గుజరాత్ బీజేపీ కార్యకర్తను. ఆ ఏడాది హైదరాబాద్ లో కొత్త చరిత్ర లిఖితమైంది. నాడు హైదరాబాద్ లో నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని వినడానికి టికెట్లు పెట్టారు. అయినా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రజలు తరలి వచ్చి, టికెట్లు కొని మరీ నా ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు. తెలంగాణ ప్రజలు నాడు కురిపించిన ప్రేమ వర్షమే నాకు టర్నింగ్ పాయింట్ గా మారింది. అందువల్లే దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభించింది” అని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
“ఇదే హైదరాబాద్, ఇదే తెలంగాణ ప్రజల ఉత్సాహం భవిష్యత్తులో మార్పును తీసుకొస్తుంది. మీ గురించి ఎంత పొగిడినా తక్కువే. మీరు వెనక్కి తగ్గరు.. ఎవరి ముందూ తలవంచరు.. తప్పకుండా గెలిచి తీరుతారు.. తెలంగాణలో విజయపతాకను ఎగురవేస్తారు’’ అని రాష్ట్రంలో ఏర్పడబోయెడిది బిజెపి ప్రభుత్వమే అనే భరోసాను వ్యక్తం చేశారు.
కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని మండిపడుతూ అయినా ప్రజల మనసులో బీజేపీని తీసేయలేరని ప్రధాని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని బంధించాలని కొందరు చూస్తున్నారని చెబుతూ తెలంగాణ అభివృద్ధి నిరోధకులు నాడే కాదు నేడు కూడా ఉన్నారని మోదీ హెచ్చరించారు.
21వ శతాబ్ధంలో కొందరు మూఢనమ్మకాలు నమ్ముతున్నారని అంటూ కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా సచివాలయంకు వేళ్ళని ఆయన వైఖరిని ప్రధాని ఎండగట్టారు. గుజరాత్లో ఓ ప్రాంతానికి వెళ్తే అధికారం, సీఎం పదవి పోతుందనే నమ్మకం ఉండేది. కానీ, తాను ముఖ్యమంత్రిగా పదే పదే ఆ ప్రాంతానికి వెళ్లానని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం మూఢనమ్మకాలతో తెలంగాణ ప్రభుత్వం మీదే నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఇదే ఇక్కడి అభివృద్ధికి అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్న ప్రభుత్వం.. అభివృద్ధిని అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఉత్సాహంతో పని చేయాలంటూ బిజెపి కార్యకర్తలకు, నేతలకు ఆయన పిలుపు ఇచ్చారు.