కేంద్రంలో మార్పు తధ్యం అని భరోసా వ్యక్తం చేస్తూ రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు. హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ రావడానికి కొద్దిసేపు ముందే బెంగళూరు బయలుదేరి వెళ్లిన ఆయన అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ జాతీయ రాజకీయాలపై సమాలోచనలు జరిపారు.
అనంతరం కుమారస్వామి గౌడ్ తో కలిసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగిందేమీ లేదని, ఉజ్వల్ భారత్ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత్లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని, దేశంలో అపారమైన యువశక్తి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
‘‘నేను దేవెగౌడ, హెచ్డీ కుమారస్వామిని కలిసి అంతా చర్చించుకున్నాము. త్వరలో జాతీయ స్థాయిలో మార్పు వస్తుంది, ఎవరూ అడ్డుకోలేరు.. భారత్ మారుతుంది.. భారత్ మారాలి.. మనం అన్ని విధాలా ప్రయత్నించాలి. దేశ స్థితిని మార్చాలి’’ అని కేసీఆర్ తెలిపారు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా నేడు దేశంలో విద్యుత్, నీటి సమస్య పోలేదన్నాని గుర్తు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజల పరిస్థితి మాత్రం మారలేదని అంటూ రైతులు, దళితులు, ఆదివాసీలు…. ఇలా ఎవరూ దేశంలో సంతోషంగా లేరని స్పష్టం చేశారు.
దేశ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అంటూ ప్రచారం చేస్తోందని, ఇది దేశానికే అవమానమని ఎద్దేవా చేశారు.
నిజంగా మనసు పెట్టి అభివృద్ధి చేస్తే అమెరికా కంటే ఆర్థికంగా మనమే ఫస్ట్ ప్లేస్లో ఉంటామని కేసీఆర్ తెలిపారు భరోసా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా ? బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేక ఇంకో ప్రభుత్వం వస్తుందా ? అనేది నేటి సమస్య కాదని… ఉజ్వల భారతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్యేతర కూటమే లక్ష్యంగా కేసీఆర్ కొంత కాలంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. పలు రాష్ట్రాల్లో బీజేపీతో రాజకీయంగా విభేదిస్తున్న పలు పార్టీల నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు.
ఇప్పటికే ఈ దిశగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం, డిఎంకే అధినేత స్టాలిన్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులతో వేర్వేరుగా జరిపిన చర్చల వివరాలను దేవెగౌడకు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.