నిత్యావసరాలంటే ఉప్పు, పప్పు, బియ్యం మాత్రమే కాదని, మహిళలు రుతుక్రమంలో వాడే శానిటరీ ప్యాడ్స్ కూడా నిత్యావసరాలే… కాదు కాదు అత్యవసరాలు అని ‘డిగ్నిటీ డ్రైవ్’ అనే స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకురాలు రెనే గ్రేస్ స్పష్టం చేస్తున్నారు. ప్రతినెలా మహిళలు రుతుక్రమ సమయంలో ఎదురయ్యే సమస్యలపై ఆ సమయంలో ఆడవాళ్లు పాటించాల్సిన పరిశుభ్రతపై ఆమె అవగాహన పెంచుతున్నారు.
కేవలం తనకెదురైన సంఘటన ద్వారానే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆమె చెబుతోంది. ఈ సంస్థ ద్వారా వందలాది మంది మహిళలకు ప్రతినెలా శానిటరీ ప్యాడ్స్‌ను అందజేస్తోంది. మే 28వ తేదీన రుతు పరిశుభ్రతా దినోత్సవం. ఈ సందర్భంగా ఈ సంస్థను స్థాపించడానికి తన పనిమనిషి కుమార్తే కారణమని చెబుతోంది.
‘ఒకరోజు ఆమె తన పదమూడేళ్ల కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లెందుకు డబ్బు అడిగింది. తనకేమైంది.. ఎందుకు హాస్పటల్‌కి అని అడగ్గా.. ఆ విషయాన్ని చెప్పడానికి కూడా ఆమె బిడియపడింది. పాపకు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, చీము పట్టిందనీ, చెప్పలేక చెప్పింది. ఇక వెంటనే నేను నా స్నేహితురాలి ఆసుపత్రికి తీసుకెళ్లాను. నిజంగా చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని డాక్టర్ చెప్పారు.
రుతు సమయంలో అపరిశుభ్రత వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్ చెప్పగానే.. నేను చాలా బాధపడ్డాను. అంత చిన్న పిల్ల ఆ బాధను ఎలా భరించిందో కూడా నాకర్థం కాలేదు. అప్పటి నుంచీ నేను మా పనిమనిషితో పాటు, వాళ్ల అమ్మాయికి కూడా నెలనెలా శానిటరీ న్యాప్కిన్లు కొనివ్వడం మొదలుపెట్టాను.
అప్పుడే బాగా ఆలోచించి వాళ్లకు మాత్రమే కాదు.. వాళ్లుంటున్న బస్తీలో కూడా రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, న్యాప్కిన్లు పంచాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె వివరించారు.
ఇలా చేయడానికి తనతోపాటు మరింకొందరు ఉంటే బాగుందనుకొని ఆ విషయాన్నే ఫేస్బుక్లో పెట్టాను. మేమూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాము… సాయం చేస్తామని మిత్రులు ముందుకొచ్చారు. మేము మొదట న్యాప్కిన్లు ఇవ్వడానికి బండ్లగూడకు వెళ్లాం. అక్కడున్న వారు వాటిని తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఆ తర్వాత దేశంలో అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన రసూల్‌పురాలో నెలసరి అలవాట్లు, పరిశుభ్రత గురించి సర్వే నిర్వహించాం.
అలాగే సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న జర్ శ్రీరామ్ లాంటి మిత్రుల సహకారంతో ‘డిగ్నిటీ డ్రైవ్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆరోజు నూటయాభై మందికి శానిటరీ న్యాప్కిన్లను అందించాం. ఆ కార్యక్రమంలో మేమంతా.. రుతుక్రమ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి? ఎంత పరిశుభ్రంగా ఉండాలి? నొప్పులనూ, అసౌకర్యాలను ఎలా అధిగమించాలి? వంటి తదితర విషయాలపై చర్చించాం. ప్యాడ్ వెండింగ్ మెషీన్ కూడా పెట్టాం.
అందుకే మా మొదటి కార్యక్రమైన ‘డిగ్నిటీ డ్రైవ్’ పేరుతోనే ఫౌండషన్ని స్థాపించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మారుమూలలకూ మా సేవల్ని విస్తరించాం. దాదాపు ఇప్పటివరకు మేము 30 వేల మందికి అవగాహన సదస్సులు నిర్వహించాం. మూడు రాష్ట్రాల్లో మొత్తం ఐదు వేల మంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు.’ అని ఆమె వివరించారు.
వారు చేస్తున్న కృషికి మెచ్చి తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ వారియర్ అవార్డును అందించింది. ఈ సేవా కార్యక్రమాలే కాకుండా.. ఆమె ఓ ఐటీ సంస్థలో మానవ వనరుల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారామె.
భారతదేశంలో నెలసరి వచ్చే ఆడవాళ్ల సంఖ్య దాదాపు 40 కోట్లు ఉండగా.. అందులో 20 శాతం మంది మాత్రమే న్యాప్కిన్లు వాడుతున్నారని రెనే చెప్పారు. ఆడవాళ్లు రుతు సమయంలో న్యాప్కిన్లు వాడకపోవడానికి చదువు లేకపోవడం వల్లనో, పేదరికం వల్లనో మరే ఇతర కారణం కావచ్చని ఆమె అన్నారు. ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలు బడి మానేయడానికి, చదువుల్లో వెనకబడటానికి కారణం.. రుతుక్రమ సమస్యలే. వీటిపట్ల అవగాహన పెంచుకుని చక్కని పరిశుభ్రత పాటిస్తే బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొంది, జీవితాల్లో స్థిరపడతారు.
వైద్యుల సూచనల మేరకు ప్రభుత్వాలు కూడా సహకరించాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల పల్లెలకు సైతం న్యాప్కిన్ల పంపిణీ చేపట్టాలి. ప్రతి మహిళా ఎలాంటి భేషజం లేకుండా శానిటరీ ప్యాడ్స్‌ను ఉపయోగించే విధంగా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.