గత మార్చ్ లో ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా తమ స్వరాష్ట్రమైన గుజరాత్ పై దృష్టి సారిస్తున్నారు. సుదీర్ఘకాలం పార్టీ అధికారంలో ఉన్న ఇక్కడ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్నాయి. తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ కు సహితం ఈ ఎన్నికలు కీలకం కావడంతో, వ్యూహాత్మకంగా పావులు గడుపుతున్నారు.
2017 ఎన్నికలలో బిజెపిని దాదాపు ఓటమి అంచువరకు తీసుకు వెళ్లడంలో పాటిదారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కీలక పాత్ర వహించాడు. ఆ సమయంలో కాంగ్రెస్ కు మద్దతు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరు అగ్రనేతలు ఒకేసారి రెండురోజుల పాటు గుజరాత్ పర్యటనలు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తిగా పేరొందిన పాటిదార్లు, సహకార సంఘాలపై దృష్టి సారిస్తున్నారు.
పాటీదారులలో విశేషమైన పలుకుబడి గల హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ కు దూరం చేయడంలో ముందుగా విజయం సాధించారు. ప్రస్తుతం బిజెపి భాషనే మాట్లాడుతున్న హార్దిక్ త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజ్‌కోట్ జిల్లాలోని అట్కోట్లో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. పాటిదార్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంపై వరాల జల్లును కురిపించే కార్యక్రమం ముమ్మరం చేశారు. రాజ్‌కోట్ సౌరాష్ట్ర ప్రాంతపు ప్రధాన నగరం. ఇక్కడ బిజెపికి 2015లో తలెత్తిన పాటిదార్ల కోటా ఉద్యమం చుక్కలు చూపింది. ఎన్నికలలో కొంత బలం తగ్గింది.
182 స్థానాల గుజరాత్ అసెంబ్లీలో పాటిదార్లకు సౌరాష్ట్ర ప్రాంతంలో 16 స్థానాలు ఉన్నాయి. గుజరాత్లో రాజకీయాధికారం పటేల్ వర్గం ప్రాబల్యంతోనే సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పటేల్ వర్గానికి చెందిన వారు రాష్ట్ర అసెంబ్లీలో 55 మంది వరకూ ఉన్నారు. రాజ్‌కోట్‌తో ప్రధాని మోదీ బంధం చిరకాలంగా ఉంది. 2002లో ఆయన తొలిసారి రాజ్‌కోట్ 2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు.
ఇక రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహకార సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ, అమిత్ షాలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీనగర్‌లో శనివారం సాయంత్రం సహకార్ సమ్మేళన్‌కు వారిద్దరూ హాజరయ్యారు. సహకార సంఘాలకు ఉన్న సభ్యత్వాలు , వాటికి ఉండే ఆర్థిక వెన్నుదన్నుల క్రమంలో బిజెపి వీటిపైనే అత్యంత వ్యూహాత్మకంగా దృష్టి సారించింది. కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, దానిని అమిత్ షాకు అప్పచెప్పడం తెలిసిందే.