గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 15 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకపక్ష విజయంతో నయా చాంపియన్‌గా అవతరించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్, 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (34, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ మిల్లర్ (32 నాటౌట్, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కదం తొక్కటంతో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది. రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను టైటాన్స్ బౌలర్లు వణికించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (3/17), స్పిన్నర్లు సాయికిశోర్ (2/20), రషీద్ ఖాన్ (1/18) రాణించటంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేసింది. జోశ్ బట్లర్ (39, 35 బంతుల్లో 5 ఫోర్లు) అంచనాలను అందుకోలేదు. కెప్టెన్ సంజు శాంసన్ (14), షిమ్రోన్ హెట్మయర్ (11), పడిక్కల్ (2) విఫలమయ్యారు. టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
పవర్‌ప్లేలో రాయల్స్ బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. సాహా (5), వేడ్ (8)ను సాగనంపారు. గిల్ క్యాచ్‌ను చాహల్ వదిలేయటంతో బతికిపోయాడు. పరుగుల వేట కష్టతరమైంది. ఈ సమయంలో టైటాన్స్‌పైనే ఒత్తిడి కనిపించింది. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్య (34), శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్) జోడీ మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకుంది. మూడో వికెట్‌కు విలువైన 63 పరుగులు జోడించింది.
గిల్ సావధానంగా ఆడగా.. పాండ్య కాస్త దూకుడు చూపించాడు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకపోవటంతో ఒక్కో పరుగే జోడించారు. చివర్లో పాండ్య నిష్క్రమించినా.. డెవిడ్ మిల్లర్ (32 నాటౌట్) ధనాధన్ షోతో టైటాన్స్‌కు చారిత్రక విజయం కట్టబెట్టాడు. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టైటాన్స్ ఐపీఎల్ 2022 విజేతగా నిలిచింది. రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (1/14) మంచి ప్రదర్శన చేశాడు.
టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బౌన్స్ దండిగా లభిస్తోన్న పిచ్‌పై బ్యాటింగ్‌కు వచ్చిన రాయల్స్‌కు ఆరంభం కలిసి రాలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22, 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎదురుదాడికి దిగాడు. జైస్వాల్‌ను లెగ్ సైడ్ వ్యూహంతో వెనక్కి పంపించారు. 31 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మరో ఎండ్‌లో బట్లర్ నెమ్మదిగా ఆడుతున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (14) అంచనాలను అందుకోలేదు. 2 ఫోర్లు కొట్టిన శాంసన్.. పాండ్య బౌలింగ్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. పది బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ (2) దారుణంగా తడబడ్డాడు. దీంతో బట్లర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. పడిక్కల్‌ను రషీద్ ఖాన్ సాగనంపగా.. తర్వాతి ఓవర్లో సింగిల్ కోసం థర్డ్‌మ్యాన్ దిశగా ఆడేందుకు చూసి బట్లర్ వికెట్ కోల్పోయాడు.