2014 మే 26న దేశ చరిత్రలో అద్బుతమైన ఎన్నికల విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2019లో వరుసగా రెండోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు.
సెప్టెంబరు 2013లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని బిజెపి ప్రకటించిన తర్వాత, ‘బహుత్ హో గయీ మెహగన్యీ కి మార్, అబ్ కీ బార్ మోడీ సర్కార్’ మరియు ‘హమ్ మోడీ జీ కో లానే వాలే హై, అచ్ఛే దిన్ ఆనే వాలే హై’ వంటి నినాదాలు ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 282 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెసేతర పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. 2014 మే 26న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల తర్వాత 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు 2014తో పోలిస్తే ఈసారి బీజేపీ అద్భుత ప్రదర్శన చేయకపోవచ్చని భావించినా ఫలితాలు వచ్చేసరికి 2014 కంటే బీజేపీకి భారీ విజయాన్ని అందించింది.
2019లో బీజేపీ ఏకంగా 303 సీట్లు గెలుచుకుని నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు కావస్తున్నా చాలా మార్పులు వచ్చాయి. భారతదేశ జిడిపి దాదాపు రెండింతలు పెరిగింది, సామాన్యుల ఆదాయం కూడా దాదాపు రెండింతలు పెరిగింది. దాని ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగింది.
అమెరికా కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ చేపట్టిన సర్వే ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ 71 ప్రజామోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా నిలిచారు. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం, ఆయన తర్వాత మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ (66%), ఇటలీకి చెందిన మారియో డ్రాగి (60%), జపాన్‌కు చెందిన ఫ్యూమియో కిషిడా (48%) ఉన్నారు. 21% వద్ద ట్రాక్ చేయబడిన నాయకులందరిలో మోదీ అతి తక్కువ నిరాకరణ రేటింగ్లను కలిగి ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీకి సవాలు విసిరే జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుడు అంటూ ఎవ్వరు లేరు. వరుసగా రెండు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విజయాల తర్వాత మోదీ హవా తగ్గే సూచనలు కనిపించడం లేదు. జాతీయ ఆకర్షణలో మాస్ లీడర్‌గా ఇందిరా గాంధీని అధిగమిస్తారని, చివరికి జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్థాయిని మించి ఎదగవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టిఆర్ఎస్, శివసేన వంటి ప్రతిపక్షాలు, అనేక నిరసనలు, వ్యాఖ్యలు, విమర్శలు చేసినప్పటికీ, మోదీ ప్రభుత్వం తన బలమైన రాష్ట్రాలన్నింటిలో విజయాలతో స్పష్టంగానే బలం పుంజుకొంటున్నది. ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ, బీజేపీ తన విధానాలపై బలంగా నిలబడి ఇంకా శక్తివంతంగా కొనసాగుతోంది.
తన పదవీ కాలంలో ప్రధాని మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ అభివృద్ధికి అవసరమైన కొన్ని విధానాలను అమలు చేశారు. తన కొన్ని చారిత్రాత్మక నిర్ణయాల అమలు సమయంలో, ఆయన అనేక అడ్డంకులు ఎదుర్కొన్నా ప్రతిపక్షాల వత్తిడులకు లొంగడం లేదు.
సెప్టెంబరు 18, 2016న కశ్మీర్‌లోని ఉరీపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది భారత సైనికులను ఆర్మీ బేస్‌లో హతమార్చారు. దీనికి ప్రతిగా, మోదీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి. ఆ దాడిలో 40 మంది ఉగ్రవాదులను హతమార్చింది. కాంగ్రెస్ అధిర్ రంజన్ చౌదరి, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు సహా పలువురు కీలక నేతలు అసలు అటువంటి దాడి జరిగిందా అంటూ ప్రశ్నించారు.
సర్జికల్ స్ట్రైక్‌పై ప్రశ్నలు ‘ప్రజాస్వామ్య సర్జికల్ స్ట్రైక్’కు పిలుపునిస్తాయని బీజేపీ హెచ్చరించింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన తర్వాత సోనియా గాంధీ ‘అస్థిరతకు గురయ్యారు’. రాహుల్ గాంధీ వెళ్లి దేశ వ్యతిరేక నినాదాలు చేసిన తుక్డే-తుక్డే గ్యాంగ్ చేసిన నినాదాలకు మద్దతుగా నిలిచారు” అని బిజెపి పేర్కొంది. పుల్వామా దాడులకు పాల్పడిన వారు ఎవరన్న దానిపై మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అని బిజెపి విమర్శకులను నిలదీసింది.
ప్రతిపక్ష పార్టీల సుదీర్ఘ ప్రతిఘటనను అధిగమించి ప్రధాని మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును ఆగస్టు 1, 2019న ఆమోదించింది. మూడు సార్లు తలాక్ చెప్పిన వెంటనే తమ భర్తలు విడిచిపెట్టిన ముస్లిం మహిళలందరికీ ఈ బిల్లు పెద్ద ఊరటనిచ్చింది. “ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేసినప్పుడు, మొత్తం ‘కుంబా’ (ప్రతిపక్షం) దానికి వ్యతిరేకంగా నిలిచింది” అని ప్రధాని ఎద్దేవా చేశారు.
మెరుగుపడిన విదేశీ సంబంధాలు
మోదీ ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయంగా దేశ గమనాన్ని మార్చేశాయి. అనేక దేశాలు ఇప్పుడు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. ప్రపంచంలోని కీలక నాయకులతో ప్రధాని మంచి స్నేహసంబంధాలు నెరప గలుగుతున్నారు. డోనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, జో బిడెన్, వ్లాదిమిర్ పుతిన్‌లతో వ్యక్తిగత సంబంధాన్నిపెంపొందించుకున్నారు.
ప్రధాని మోదీ దేశ విదేశాంగ విధానాన్ని దేశీయ ప్రయోజనాలతో నిరంతరం అనుసంధానం కావిస్తున్నారు. ఈ విషయంలో మన దేశీయ అవసరాలకు ప్రాముఖ్యతను తీసుకు వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
“యాక్ట్ ఫార్ ఈస్ట్”, “యాక్ట్ వెస్ట్ ఏషియా” వంటి విధానాలు కావచ్చు, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా, అమెరికా, ఐరోపా దేశాలతో మన సంబంధాలు కొనసాగిన తీరు కావచ్చు ప్రధాని చతురతకు, దౌత్యనీతికి నిదర్శనాలు అని చెప్పవచ్చు.
మధ్యప్రాచ్య దేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. ప్రపంచ మార్కెట్లలో భారతదేశ స్వతంత్ర ప్రయోజనాలతో పాటుగా ఎఫ్‌డిఐలు, ‘మేడ్ ఇన్ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లను అంతర్జాతీయంగా బలమైన మద్దతును కూడదీయగలుగుతున్నారు.
‘వికాస్పురుష్’గా మోదీ ఇమేజ్ కారణంగా గత 8 ఏళ్లలో బీజేపీ ధనవంతులు, పేదలు ఇద్దరితోనూ కనెక్ట్ కాగలుగుతుంది. దేశం నలుమూలల తన ప్రాబల్యాన్ని విస్తరింప చేసుకోగలుగుతుంది. ఒక బలమైన హిందూ నాయకుడిగా ఆయన ఇమేజ్ ఓటర్లను ఏకీకృతం చేయడానికి దారితీసింది.
అద్భుతమైన ఎన్నికల విజయాలు
అసామాన్యమైన ప్రధాని మోదీ వ్యక్తిగత ఇమేజ్ తో పాటు బలీయమైన పార్టీగా బిజెపి విస్తరించడంతో 2014లో అద్భుతమైన ఎన్నికల విజయాలను వరుసగా బిజెపి సొంతం చేసుకోగలుగుతుంది. 2014లో కాంగ్రెస్ దుమ్ము దులిపేసి గెలుపొందిన సెట్లకంటే 2019లో 21 సీట్లు ఎక్కువగా గెల్చుకోవడమే అందుకు నిదర్శనం.
దేశంలో సంకీర్ణ రాజకీయాల శకాన్ని ఒక విధంగా ముగించి, ఓ బలమైన రాజకీయ శక్తిగా బిజెపి దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుంది. మరో 30 ఏళ్ళ వరకు భారత దేశ రాజకీయ గమనాన్ని బీజేపీయే నిర్దేశిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహితం పేర్కొనడం గమనార్హం.
పార్టీ సభ్యత్వ స్థావరాన్ని విస్తరించడం, కార్యకర్తలతో క్రమం తప్పకుండా నిమగ్నమవ్వడం, విస్తృతమైన ప్రచారాన్ని పోలింగ్ బూత్ స్థాయి నుండి చేపట్టడం ద్వారా ఎన్నికల ప్రచారంలో బిజెపితో పోటీపడగల వారెవ్వరూ నేడు కనిపించడం లేదు. పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.
గత 8 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుతమైన ఎన్నికల విజయాలు ప్రతిపక్షాలను స్పష్టంగా కలవర పరుస్తున్నాయి. బిజెపికి ప్రస్తుతం 17 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలు ఉన్నాయి.
అంటే, 44 శాతం భూభాగంలో 49.5 శాతానికి పైగా ప్రజలు బిజెపి పాలనలో ఉన్నారు. బిజెపి అధికారంలో ఉన్న 17 రాష్ట్రాలు: కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, యుపి, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. ఏకైక కేంద్రపాలిత ప్రాంతం: పుదుచ్చేరి.