కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ముస్లిం విద్యార్థినులు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను సోమవారం కలుసుకోవడంతో ఇస్లాం సాంప్రదాయక వస్త్రధారణ వివాదం మళ్లీ ముందుకొచ్చింది.
విద్యా సంస్థలలో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని శనివారం మంగళూరు యూనివర్సిటీ లో డిమాండు చేసిన 12 మంది విద్యార్థినులు సోమవారం కూడా క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థినులకు డ్రెస్ కోడ్ ఉండడంతో శనివారం వారిని క్యాంపస్‌లోకి అనుమతించని యూనివర్సిటీ అధికారులు సోమవారం కూడా వారిని అడ్డుకున్నారు.
దీనిపై జిల్లా డిప్యుటీ కమిషనర్‌ను కలుసుకోవాలని అధికారులు సూచించడంతో విద్యార్థినులు ఆయనను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం డిప్యుటీ కమిషనర్ డాక్టర్ రాజేంద్ర కెవి విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ సిండికేట్ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశ్నించలేనని చెప్పారు.
యూనివర్సిటీలో డ్రెస్ కోడ్ మినహా మరే ఇతర వస్త్రాలకు అనుమతి లేదన్న సిండికేట్ నిర్ణయానికి విద్యార్థులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గతంలోనే హైకోర్టు తీర్పు వెలువడినందున ఎవరూ దీన్ని సవాలు చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం లోపలికి అనుమతించడంలేదని ఆయన తేల్చి చెప్పారు.
యూనివర్సిటీ అధికారులు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని, విద్యా ప్రాంగణాల్లో హిజాబ్ లేదా కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల శాంతికి విఘాతం కలిగే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయొద్దని విద్యార్థినులకు సూచించానని అధికారి రాజేంద్ర చెప్పారు.
చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కాలేజీ క్యాంపస్‌లో శాంతి, సామరస్యాల గురించి ఆలోచించాలని విద్యార్థినులకు సూచించానని పేర్కొన్నారు. ఈ విషయంపై మంగళూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పీ సుబ్రమణియం యడపడితయ మాట్లాడుతూ హైకోర్ట్, ప్రభుత్వ ఆదేశాలకు యూనివర్సిటీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆదేశాల అమలులో ఏ విద్యార్థికైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.