ఒక వంక బిజెపికి చెందిన ముగ్గురు ముస్లిం రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండగా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తున్న 22 స్థానాలలో ఒక్కటి కూడా ముస్లిం అభ్యర్థులు ఎవ్వరికీ కేటాయించక పోవడంతో బిజెపి పార్లమెంటరీ పార్టీలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పోతున్నది.
బిజెపికి చెందిన ముగ్గురు ముస్లిం ఎంపీలు – కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మాజీ మంత్రి ఎంజే అక్బర్, పార్టీ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంల రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది.
అయితే, జూన్ 23న జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ ఉపఎన్నికల్లో ఒకదానిలో అభ్యర్థిగా లేదా మరో కీలక పదవిలో నఖ్వీకి త్వరలో స్థానం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తన రాంపూర్ లోక్‌సభ సీటుకు రాజీనామా చేశారు. రాంపూర్ లోక్ సభ నియోజకవర్గానికి జూన్ 23న ఉపఎన్నిక జరగనుంది.
ఒకవేళ ఈ ఎన్నికలో గెలిస్తే లోక్ సభలో బీజేపీ తరఫున ఉన్న ఏకైక ముస్లిం నేత నఖ్వీ అవుతారు. రాజ్యసభ సభ్యత్వం నక్వీకి నిరాకరించడానికి బిజెపి అధికారికంగా కారణాన్ని తెలియజేయనప్పటికీ, అభ్యర్థుల ఎంపికలో `మారిన ప్రాధాన్యతల’ గురించి ఆయనకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.
నఖ్వీ ప్రస్తుతం రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. ఆయన మోదీ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా మద్దతుగా మాట్లాడే కేంద్ర మంత్రులలో ప్రముఖులే కాకుండా, జాతీయ స్థాయిలో బిజెపికి ఏకైక `ముస్లిం ముఖం’గా కొనసాగుతున్నారు.
నఖ్వీకి రాజ్యసభ సీటు నిరాకరించినప్పటికీ వెంటనే ఆయన మంత్రి పదవికి ముప్పు లేదని చెబుతున్నారు. ఆయన ప్రస్తుత పదవి కాలం జూలైతో ముగుస్తుంది. ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, మరో ఆరు నెలలు మంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఆ లోగా పార్టీ అధిష్టానం ఆయనను గెలిపించవచ్చు.
బిజెపి కూడా ఇంకా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉపాధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఉపరాష్ట్ర పదవికి మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఒకరిని అగ్ర నాయకత్వం ఎంచుకోవచ్చని తెలుస్తున్నది.
రాష్ట్రపతి నామినేట్ చేయవలసిన 7 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఓ ముస్లిం ప్రముఖుడిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు మొత్తం ఎన్డీయే కూటమిలో కేవలం ఒక ముస్లిం ఎంపీ మాత్రమే ఉన్నారు. ఆయన లోక్ జనశక్తి పార్టీకి చెందిన మెహ్బూబ్ అలి ఖైజర్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆరుగురు ముస్లిం నేతలను బరిలోకి దింపింది. వారందరూ ఓడిపోయారు.