19 సంవత్సరాల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. జులై 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మదాపూర్ హైటెక్స్‌లోని హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ వేదికగా సమావేశాలు జరగనున్నాయి.
బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతకు ముందు సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి నోవాటెల్, తాజ్‌కృష్ణ హోటళ్లను సందర్శించారు. సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు మొత్తం 400 మంది హాజరు కానున్నారు.
సమావేశాలు జరిగే రెండ్రోజులు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. సీఎంలు, కేంద్ర మంత్రులు తాజ్‌కృష్ణలో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీకి ఇవ్వడం సంతోషకరమని, దీన్ని విజయవంతం చేయాలని పార్టీ నేతలను బీఎల్ సంతోష్ కోరారు.
సమావేశంలో తరుణ్ చుగ్, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఇంద్రసేనా రెడ్డి, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మళ్లీ 19 ఏండ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇవే మొదటి సమావేశాలు.
కాగా, తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందనడానికి ఈ సమావేశాలు ఇక్కడ నిర్వహించడమే నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెలలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు రాష్ట్రంలో పర్యటించడం గమనార్హం.
ఈ సమావేశాలలో 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పార్టీ వ్యూహం, కార్యక్రమాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పార్టీ ఒక్కసారి కూడా గెలుపొందని నియోజకవర్గాలు, ఒక్క సారి కూడా అధికారంలోకి రాలేని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా కదులుతున్నది.