ప్రతిపక్షాలు ఎంతగా వత్తిడి తెస్తున్నా కులాల వారీగా జనాభా గణాంకాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుతం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈ విషయమై బిజెపి మిత్రపక్షం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలంగా వత్తిడి తెస్తున్నా లెక్కచేయడం లేదు. అయితే, తాజాగా బీహార్ బిజెపి విభాగం కేంద్ర ప్రభుత్వం వైఖరికి భిన్నంగా నితీష్ కుమార్ తో చేతులు కలిపి, రాష్ట్రంలో కుల జనాభా సేకరణకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.
ఈ విషయమై నితీష్ కుమార్ బుధవారం జరిపిన అఖిల పక్ష సమావేశంలో బిజెపితో సహా రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు అన్ని పాల్గొన్నాయి. ఈ విషయమై నితీష్ కుమార్ కు బాసటగా నిలబడడానికి సిద్దపడ్డాయి.
సమావేశం అనంతరం నితీష్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కుల గణన చేయడం కుదరని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం సొంతంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనికి రాష్ట్రంలో శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది పార్టీలు కులగణన చేపట్టాలని నిర్ణయించాయని తెలిపారు.
రాష్ట్ర క్యాబినేట్లో ఈ విషయంపై ఆమోదం పొంది, దీని కోసం నిధులను కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను సరైన రీతిలో ప్రచారం చేసి..పూర్తి చేసేందుకు గడువును నిర్ణయిస్తామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టే అంశంపై రాష్ట్ర బిజెపి విభాగంతో సహా అన్ని పార్టీలు గత ఏడాది ప్రధాని మోదీని కలిశాయి. అయితే ఆయన తిరస్కరించడంతో బీహార్ రాష్ట్ర కుల గణనకు సిద్ధమైంది. ఇందుకు బిజెపి రాష్ట్ర విభాగం కూడా పూర్తి మద్దతునిస్తోంది.
నితీష్ నిర్వహించిన సమావేశంలో బిజెపి పార్టీ తరుపున రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజరు జైస్వాల్, ఉప ముఖ్యమంత్రి తార్ కిశోర్ ప్రసాద్ హాజరయ్యారు. ఆర్జెడి నుండి తేజశ్వి యాదవ్, రాజ్యసభ ఎంపి ఎంపి మనోజ్ కుమార్ ఝా, ఎఐఎంఐఎం బీహార్ చీఫ్ అక్తరుల్ ఇమాన్ హాజరయ్యారు.