కేంద్ర ప్రభుత్వం ఎంతగా విముఖత చూపుతున్నప్పటికీ బిజెపి భాగస్వామి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రంలో బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కులాలవారీ జనన సేకరణకు ముందుకెళుతున్నారు.
నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ మంత్రివర్గం కులాల వారీ జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. 2023 ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని గడువు విధించింది. దీని కోసం కంటింజెన్సీ ఫండ్ నుంచి రూ.500 కోట్లు కేటాయించింది.
బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమీర్ సుభానీ గురువారం మీడియాతో మాట్లాడుతూ కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరినాటికి పూర్తి కావాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
సాధారణ పరిపాలనా శాఖ నోటిఫికేషన్ను జారీ చేసిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధి నుంచి రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవారికి సరైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నితీశ్ కుమార్ నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం కులాలవారీ జనగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిహార్ శాసన సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వికాశ్శీల్ ఇన్సాన్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీలకు శాసన సభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ మూడు పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.
అఖిల పక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గురువారం ఇచ్చిన ట్వీట్లలో, ఐడియలాజికల్ పార్టీలు సుదీర్ఘ పోరాటం చేశాయని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిందని, వీటన్నిటి ఫలితంగానే కులాలవారీ జన గణనకు చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని తెలిపారు.