మహమ్మద్ ప్రవక్తపై, ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్లను వరుసగా పార్టీ నుండి బహిష్కరించడంపై ఢిల్లీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది నాయకులు సోషల్ మీడియాలో నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నప్పటికీ చాలామంది అంతర్గత వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత సంభాషణలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా తన ఆలోచనలతో ప్రజల్లోకి తీసుకు వెడుతూ ఇలా ట్వీట్ చేశారు: “వారి దేశం ఇస్లామిక్ దేశం. ముస్లింల హక్కుల గురించి మాట్లాడటం, ఆర్థిక బహిష్కరణ, ఉద్యోగాల తొలగింపు… మతం పేరుతో బహిరంగంగా మాట్లాడటం. హిందువు ఈ ప్రపంచంలో రెండవ తరగతి పౌరుడు. కేవలం హిందూ మతం మాత్రమే దానిని అవహేళన చేసినందుకు లేదా దుర్వినియోగం చేసినందుకు శిక్ష ఉండదు, బదులుగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది” అంటూ అవహేళన చేశారు.
ఢిల్లీలోని ఝరోడా ప్రాంతానికి చెందిన మండలాధ్యక్షుడు ఫేస్బుక్లో హిందీలో ఇలా వ్రాశాడు: “నేను అన్ని మతాలను గౌరవిస్తాను. కానీ ఒక మతానికి చెందిన వ్యక్తులు మన దేవుడి గురించి మాట్లాడితే, అది మంచిది, మనం నోరు విప్పితే, పార్టీ మమ్మల్ని శిక్షిస్తుంది. మీరు మీ కార్యకర్తతో నిలబడలేకపోతే, వాటిని కూడా ఉపయోగించడం మానేయండి. కోట్లాది కార్యకర్తల నమ్మకాన్ని పార్టీ వమ్ము చేసింది. మీరు నుపుర్ శర్మకు అండగా ఉండకపోతే కార్యకర్తలు మీ కోసం ఎందుకు పోరాడతారు? “. అయన వాఖ్యలకు మంచి మద్దతు లభించింది.
బిజెపి నాయకుడు, యువమోర్చా రాష్ట్ర ఐటి సెల్ ఇన్ఛార్జ్ అభిషేక్ దూబే ఇలా ట్వీట్ చేశారు: “ప్రతి ఒక్కరికీ ఎక్కడో ఒకచోట విశ్వాసం ఉన్నందున నేను ఏ మతాన్ని అవమానించడాన్ని సమర్థించను. కానీ మన శివాజీని కూడా అవమానించారు… ఎవరిపైనా అయినా చర్యలు తీసుకున్నారా? ఈరోజు నవీన్ జీ, నూపుర్ జీ లకు పార్టీ సహాయం అత్యంత అవసరమైనప్పుడు, వారిని విడిచిపెట్టారు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, ఈ నిర్ణయం “లక్ష్మణ రేఖను దాటలేము” అనే కఠినమైన, చాలా అవసరమైన సందేశాన్ని పార్టీలో అందరికి పంపినదని ఢిల్లీ యూనిట్ ఆఫీస్ బేరర్ ఒకరు పేర్కొన్నారు.
మరో సీనియర్ బిజెపి నాయకుడు మాట్లాడుతూ, పార్టీలో సీనియర్ పదవులను కలిగి ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యను ఆహ్వానించకూడదనుకోవడం వల్ల మౌనంగా ఉన్నారని చెప్పారు. “కానీ ఇటువంటి చర్యలు మనకు అత్యంత విశ్వాసపాత్రుమైన మన మద్దతు దారులలో కొందరిని దూరం చేస్తుంది” అని ఆయన హెచ్చరించారు. దేశం వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా చర్చలలో బిజెపి మద్దతు దారులు అనేకమంది ఈ చర్యను సమర్ధింపలేక పోతున్నారు.