ఆంధ్ర ప్రదేశ్ లో పాలనే కాదు అభివృద్ధి కూడా రివర్స్‌లోనే వెళుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం స్కీములతో అన్ని రంగాల్లో ముందుకెళుతుంటే..ఏపీ ప్రభుత్వం మాత్రం మాఫియాలో ముందుకు సాగుతోందని విమర్శించారు.
విజయవాడలో జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పర్యటన సందర్భంగా సోమవారం జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే ఏపీని పరిపుష్టం చేస్తానని చెప్పిన జగన్మోహన రెడ్డి అందుకు విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏపీ అంటే ఉన్నతంగా ఉండేదని చెపుతూ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కూడా ఏపీ అప్పులపై చర్చలు పెడుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి కూడా కనీసం పరిశ్రమలు తీసుకు రాలేదని, ప్రభుత్వపరంగా ఆస్తులు కూడబెట్టలేదని ఆమె దయ్యబట్టారు. ఇటీవల ఒక పారిశ్రామిక వేత్త పెట్టుబడులను తమిళనాడుకు తరలిస్తున్నట్లు చెప్పడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోందని ఆమె తెలిపారు. భూ, మట్టి, మద్యం ఇలా ఏ ఒక్కదాన్ని చూసినా కనిపించేది మాఫియానేనని ఆమె ధ్వజమెత్తారు.
ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇటీవల నిర్వహించిన సామాజిక న్యాయం బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మల్లింపులో భాగమే అమలాపురం ఘోర కలి అని ఆమె తెలిపారు.
మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెపుతూ శక్తి కేంద్రాల ప్రముఖులు కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ గతంలో తెదేపా, ప్రస్తుతం వైసీపీ బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక మైండ్ గేమ్ ఆడుతున్నాయని హెచ్చరించారు. దీనిని బలంగా తిప్పి కొట్టేందుకు ప్రజా ఉద్యమాలు చేద్దామంటూ అందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్, రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ కే.లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.