దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించకుండా, కీలక నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుండటాన్ని బహిర్గతం చేసిన బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ దురాగతంలో ఎంఐఎం ఎమ్యెల్యే కుమారుడికి సంబంధం ఉందని ఆయన ఫోటోలు, వీడియో బహిర్గతం చేయడంతో, అతనికి ఈ కేసుతో సంబంధం లేదని ఆ ముందు రోజే సర్టిఫికెట్ ఇచ్చిన పోలీసులకు అతనిపై దర్యాప్తులో దృష్టి సారించక తప్పలేదు. పైగా, అతనిని నిందితుడిగా చేర్చడం కోసం మీనమేషాలు లెక్కపెడుతున్నారు.
తాజాగా, రఘునందన్ రావుకు జూబ్లీహెల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో వీడియోలు ఫోటోలు బయట పెట్టారని అడ్వకేట్ కొమ్మిరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేశారు.
దీనిపై స్పందించిన ఆయన తనకు నోటీసులు, కేసులు కొత్త కాదని పేర్కొంటూ న్యాయవాదిగా దశాబ్దాలపాటు అనుభవం గల తాను చట్టపరిధిలోనే వ్యవహరిస్తుంటానని స్పష్టం చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే తాను ఆధారాలు బయట పెట్టానని చెబుతూ, న్యాయస్థానంలో తేల్చు కుంటానని తెలిపారు.
కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలసి రాజకీయంగా నాటకాలు డుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇదే మెదటి.. చివరి ఎఫ్ఐఆర్ కాదని, ఉద్యమంలో పోరాడిన వాడినని, తనపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. చట్టం తెలిసిన వాడిగా సాక్ష్యాలను మాత్రమే బయట పెట్టినట్లు స్పష్టం చేశారు.
కేసులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెబుతూ మైనర్ బాలికకు న్యాయం చేయటమే తమ లక్ష్యమని వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతూ ఇతర నేతలకు లేని నిబంధనలు.. తన విషయంలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదేం రాజకీయమో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
నిందితులను అరెస్ట్ చేయమని అడుగుతుంటే.. తనపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎంను విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ ఎందుకు ఉలికిపడుతుందని ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
కాగా, న్యాయం కోసం పోరాడుతోన్న ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చెప్పారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ దోషులను అరెస్ట్ చేయడంపట్ల ఉంటే బాధితులకు న్యాయం జరిగేదని పేర్కొన్నారు.
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని చెబుతూ ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనమేనని విమర్శించారు.
నేరాలను అరికట్టడంలో తామే నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక గ్యాంగ్‌రేప్ ఘటనపై మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. సికింద్రాబాద్ రేప్ కేసుపై కూడా మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీకి ఎన్సీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది.