జమ్ముకాశ్మీర్‌లో కొనసాగుతున్న లక్ష్యిత దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ జరిగిన లక్ష్యిత దాడుల్లో 22 మంది మృతి చెందారు. మృతులంతా మైనార్టీలు, వలసకార్మికులు, భద్రతా సిబ్బందే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
కాగా, ఈ లక్ష్యిత హత్యల్లో నిందితులుగా భావిస్తున్న 14 మంది ఉగ్రవాదులు, వారి సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుల్లో ప్రభుత్వ ఉద్యోగైన కాశ్మీరీ పండిట్, నలుగురు వలస కార్మికులు, నలురుగు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు.
అలాగే వీరిలో నలుగురు పోలీస్ సిబ్బంది, ఒక ఆర్మీ సైనికుడు, ఇద్దరు సిఆర్పిఎఫ్ సిబ్బంది, ఇద్దరు రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) సిబ్బంది, ముగ్గురు స్థానికులు ఉన్నారు. అలాగే మధ్య కాశ్మీర్లో 10 మంది (ఇందులో ఏడుగురు బుద్గాంలో, ముగ్గురు శ్రీనగర్‌లో) మరణించారు.
దక్షిణకాశ్మీర్లో 10 మంది (ఇందులో కుల్గాంలో ఐదుగురు, పుల్వామాలో ముగ్గురు, అనంతనాగ్, షోపియాన్‌లో ఒకొక్కరు) మృతి చెందారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఇద్దరు మరణించారు.
తేదీల వారీగా దాడుల సమాచారం :
జనవరి 29 : అలీ మహమ్మద్ గని అనే పోలీసును అనంతనాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్చిచంపారు.
మార్చి 2 : కుల్గాం జిల్లాలో కుల్పోరా అనే గ్రామంలో మహమ్మద్ యాకూబ్ దార్ అనే పంచాయితీ సభ్యున్ని హత్య చేశారు.
మార్చి 9 : శ్రీనగర్ శివారులో సమీర్ అహ్మద్ భట్ అనే సర్పంచ్‌ను ముగ్గురు ఉగ్రవాదులు కాల్చిచంపారు.
మార్చి 10 : సమీర్ అహ్మద్ మల్లా అనే సైనికుడిని బుద్గాంలోని లోకిపోరా వద్ద లష్కర్‌తోయిబా ఉగ్రవాదలు హత్య చేశారు.
మార్చి 12 : కుల్గాంలో ఔదోరా అనే గ్రామంలో సబీర్ అహ్మద్ మిర్ అనే సర్పంచ్‌ను కాల్చి చంపారు.
మార్చి 12 : సోఫియాన్ జిల్లాలో చోతిపోరా అనే గ్రామంలో ముఖర్ అహ్మద్ అనే సిఆర్పిఎఫ్ సిబ్బందిని కాల్చి చంపారు.
మార్చి 21 : బుద్గాంలో గోత్పోరా అనే గ్రామంలో తజముల్ మోహిదీన్ దార్ అనే స్థానికున్ని హత్య చేశారు.
మార్చి 26 : ఇష్ఫకర్ అహ్మద్ అనే ప్రత్యేక పోలీసు అధికారిని, అతని సోదరుడు ఉమర్ అహ్మద్‌ను చాద్బుగ్ బుద్గాంలోని వారి నివాసంలోనే ఉగ్రవాదులు హత్య చేశారు.
ఏప్రిల్ 4 : శ్రీనగర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో విశాల్ కుమార్ అనే సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందగా, అతని సహచరుడు తీవ్రంగా గాయపడ్డారు.
ఏప్రిల్ 13 : కుల్గాం జిల్లాలోని కక్రాన్ అనే గ్రామంలో సతీష్ కుమార్ సింగ్ అనే రాజ్‌పుత్‌లకు చెందిన వ్యక్తిని కాల్చి చంపారు.
ఏప్రిల్ 15 : బారాముల్లా జిల్లాలో గోస్బుగ్ అనే గ్రామంలో మంజూర్ అహ్మద్ బంగ్రూ అనే సర్పంచ్‌ను హత్య చేశారు.
ఏప్రిల్ 18 : కకపోరా రైల్వే స్టేషన్ వద్ద సురిందర్ సింగ్, దేవ్ రాజ్ అనే ఇద్దరు ఆర్పిఎఫ్ సిబ్బందిని దారుణంగా హత్య చేశారు.
మే 12 : రాహుల్ భట్ అనే కాశ్మీరీ హిందూ ప్రభుత్వ ఉద్యోగిని బుద్గాంలోని చదూర్లో అతని కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారు.
మే 13 : పుల్వామాలోని గుదోర్ అనే గ్రామంలో రియాజ్ అహ్మద్ ఠాకూర్ అనే పోలీసును కాల్చిచంపారు.
మే 17 : బారాముల్లాలో రంజిత్ సింగ్ అనే వైన్ షాప్ ఉద్యోగిని అతని దుకాణంలోనే హత్య చేశారు.
మే 24 : సౌరా శ్రీనగర్ వద్ద సైఫుల్లా ఖద్రి అనే పోలీసును కాల్చి చంపారు. ఈ దాడిలో ఖద్రి తొమ్మిదేళ్ల బాలిక కూడా తీవ్రంగా గాయపడింది.
మే 25 : హుష్రూ చదోరా వద్ద టివి అర్టిస్టు అమ్రీన్ భట్‌ను నివాసంలోనే కాల్చి చంపారు.
మే 31 : కుల్గాంలో గోపాల్‌పోరా వద్ద రజని బాలా అనే మహిళా స్కూల్ టీచర్‌ను కాల్చి చంపారు.
జూన్ 2 : కుల్గాంలో అరెహా అనే గ్రామంలో విజయ్ బెనివాల్ అనే బ్యాంక్ మేనేజర్‌ను కార్యాలయంలోనే హత్య చేశారు.
జూన్ 2 : బుద్గాంలోని చదోరా వద్ద దిల్కుష్కుమార్ అనే వలస కార్మికున్ని హత్యచేశారు. ఈ దాడి అతని తోటి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.