తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మరింత ఉత్సాహంతో దూసుకెళ్లాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని బీజేపీ కార్పొరేటర్లు, ఇతర బిజెపి నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్ధేశం చేశారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని న్యూఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న తన అధికార నివాసంలో వారితో సుమారు గంటన్నరసేపు సమావేశమై కష్టపడితే తెలంగాణలో అధికారం మనదేనని భరోసా ఇచ్చారు.
సేవతో ప్రజలకు దగ్గరవ్వవచ్చని చెబుతూ న్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, మిగతా సమయమంతా ప్రజా సేవలోనే మమేకమవ్వాలని కార్పొరేటర్లకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
కార్పొరేటర్లకు రాజకీయ జీవితం ఇప్పుడే ఆరంభమైందని, కష్టపడితే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని, వచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకుంటూ వారికి చేరువ కావాలని సూచించారు.
ఎదుగుతున్న క్రమంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా మీడియాతో జాగ్రత్తగా మాట్లాడాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని మోదీ మే 26న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల నుంచి ఐఎ్‌సబీ వద్ద స్వాగతం అందుకోవాలని నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా అది సాధ్యం కాకపోవడంతో వారిని ఢిల్లీలో కలిసేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు.
దాదాపు 45 నిమిషాలపాటు ప్రధాని సంభాషించారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ దశలో మరింత కష్టపడితే సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బిజెపి మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధరరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి ఆతిధ్యం
ప్రధానితో భేటీ కోసం ఢిల్లీ చేరుకున్న జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, ఇతర నేతలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆతిథ్యమిచ్చారు. మధ్యాహ్నం ఆయన నివాసంలోనే ప్రత్యేక వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు.
అంతకంటే ముందు కార్పొరేటర్లు బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌ను కలిశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం ఆయన కార్పొరేటర్లకు సూచనలు చేశారు. ఈ భేటీ అనంతరం మళ్లీ కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న కార్పొరేటర్లతో సమావేశమయ్యేందుకు కిషన్ రెడ్డి నివాసానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవడంపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న తమకు ఎంతో విలువైన సమయం కేటాయించిన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణలో ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులకే సమయం దొరకని పరిస్థితి ఉందని, అలాంటిది బీజేపీలో ఏకంగా దేశ ప్రధానే తమకు సమయమిచ్చి సుదీర్ఘంగా మాట్లాడారని సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలతోనే ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ప్రధాని తమకు సూచించారని వారు చెప్పారు.