ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నాడ వెళ్తుండగా సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్ఐ శివప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీంతో సోము వీర్రాజుపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అమలాపురంలో జరిగిన అల్లర్లలో అమాయకులను అరెస్టు చేశారని, వారి కుటుంబాలను పరామర్శించడానికి సోము వీర్రాజు బుధవారం జొన్నాడకు బయలుదేరారు. అయితే కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సెంటరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆయన కారులోంచి దిగి తననే అడ్డుకుంటారా అంటూ ఒంటికాలిపై లేచారు.
అక్కడే ఉన్న ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలాపురం వెళ్లడానికి అనుమతి లేదని వీర్రాజుకు తేల్చిచెప్పారు.
దీంతో సోముతో పాటు అక్కడికి చేరుకున్న పలువురు బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లడం కుదరదని చెప్పడంతో సోము మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఈ సమయంలో ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్‌తో పాటు అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిపై సోము వీర్రాజు మండిపడ్డారు.
కాగా, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారారని సోము వీర్రాజు ఆరోపించారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం కొమ్ముకాయడం బాధాకరమని పేర్కొన్నారు. కోనసీమ ప్రజలు నేడు పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఊపిరి తీసుకునే దౌర్భాగ్య పరిస్థితికి కారకులు ఎవరని ఆయన ప్రశ్నించారు.
అల్లర్లకు ఆజ్యం పోసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే.. అమాయకులు మాత్రం కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్నారని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోలీసులతో శత్రుత్వం లేదన్నారు. పోలీసులే తమను రెచ్చగొట్టారని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.
‘‘పోలీసులు ఆపితే ఆగుతాము. పోలీసు వాహనాలు మోహరించినా ఆగుతాము. ఒక ప్రైవేటు లారీ మా వాహనాలకు అడ్డుగా ఎలా పెడతారు? లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రశ్నించారు. 5 “ఏళ్లు అధికారంలో ఉండే వ్యక్తుల కోసం అధికారులు తొత్తులుగా మారొద్దు. ఫలితంగా మీ భవిష్యత్తును ఇబ్బందుల్లో పెట్టుకోవద్దు’’ అని పోలీసులను ఉద్దేశించి వీర్రాజు హెచ్చరించారు.
‘