ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై, రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రపంచమంతా విస్తుపోయేలా పాలన కొనసాగిస్తున్న చరిత్ర నరేంద్రమోదీదైతే, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనత కేసీఆర్ దని ఆయన విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బీజేపీ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూకుట్ పల్లిలో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ బీజేపీ విలక్షణమైన పార్టీ అని, పార్టీ పుట్టినప్పటి నుండి అనేక అవమానాలను ఎదుర్కొందని, అవహేళనలకు గురైందని తెలిపారు. మతోన్మాద పార్టీ అన్నారని, దళిత, బీసీల వ్యతిరేక పార్టీ అన్నారని, ఇది గుజరాత్ మార్వాడీల పార్టీ అని నవ్వుకున్నారని, అగ్రవర్ణాల పార్టీ అన్నారని గుర్తు చేశారు.
అయితే, విమర్శించిన కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయని, ఈ దేశమే మాది, మేం చెప్పిందే శాసనమని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ 440 ఎంపీ స్థానాలనుండి 44కు పడిపోయిందని సంజయ్ ఎద్దేవా చేశారు. 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఈ రోజు 303 ఎంపీలతో దేశాన్ని పాలిస్తోందనే విషయాన్ని కుహానా శక్తులు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. యూపీసహా 18 రాష్ట్రాల్లో అధికారంలోకి ఉందని గుర్తు చేశారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ రూపురేఖలనే మార్చేశారని, మచ్చలేని నీతివంతమైన పాలన కొనసాగిస్తున్నారని సంజయ్ కొనియాడారు. ఈ దేశంలో ఏ ఒక్కరూ ఇల్లు లేని వారు ఉండకూడదనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరిట ఇల్లు నిర్మించే మహాయజ్ఝం నిర్వహిస్తున్న నాయకుడు మోదీజీ అంటూ దేశవ్యాప్తంగా 2.55 కోట్ల ఇళ్లు పూర్తి చేసి రికార్డు సృష్టించారని తెలిపారు.
మోదీజీ రాకముందు దేశంలో వేల గ్రామాలు ఇంకా కరెంట్ లేక చీకట్లో మగ్గుతుండే… ఆ బాధ చూడలేక ఒకే ఏడాది యుద్ద ప్రాతిపదికన 18 వేల గ్రామాలకు వెలుగులందించిన మహనీయుడు మన మోదీజీ అని చెప్పారు.
మహిళల ఆత్మగౌరవాన్ని, వారి వంట బాధలను తీర్చేందుకు దేశంలో 9 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించిన ఘనత మోదీజీకే చెల్లుతుందని స్పష్టం చేశారు. గత 8 ఏళ్లలో 11 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానాయకుడు మోదీజీ అని పేర్కొన్నారు.
మహిళలు ఆర్దికంగా నిలబడాలనే ఉద్దేశంతో 23 కోట్ల మంది మహిళల పేరిట జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి ఆర్దికంగా చేయూతనందిస్తున్న నాయకుడు మోదీజీ అని తెలిపారు. ఈరోజు ‘స్టాండ్ అప్ ఇండియా’ కింద సొంతంగా సంస్థలు స్థాపిస్తున్న వారిలో 81 శాతం మంది మహిళలే అని గుర్తు చేశారు. కేంద్రం అందిస్తున్న ముద్రా యోజన లబ్ది దారుల్లో 68 శాతంకు పైగామహిళలే కావడం మోదీజీ మహిళా పక్షఫాతి అనేదానికి నిదర్శనం అని సంజయ్ చెప్పారు.
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే… భారత దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని, ఏ రంగమూ దెబ్బతినకూడదనే గొప్ప ఆశయంతో 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్బర భారత్ ప్యాకేజీని ప్రకటించి అమలు చేసిన మహానాయకుడు మోదీజీ అని తెలిపారు. అంత్యోదయ పేరుతో ఈ దేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందిస్తున్నారని చెప్పారు.
ప్రధానిని, కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారే తప్ప పేదలకు ఏమాత్రం న్యాయం చేయని సీఎం కేసీఆర్… తెలంగాణ రాకముందు ఎట్లాంటి పరిస్థితులున్నయో 8 ఏళ్ల తరువాత కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులున్నాయని సంజయ్ ధ్వజమెత్తారు.
కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను సహా అన్ని ఛార్జీలు పెంచి ఆదాయాన్ని దండుకుంటున్నా… ప్రభుత్వ ఉద్యోగులకు నేటికీ సక్రమంగా జీతాలు ఇవ్వలేని దుర్మార్గపు సీఎం కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా… అరెస్టు చేసినా బీజేపీని ఏమీ చేయలేవని స్పష్టం చేశారు.