రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వరకు జాతీయ రాజకీయాలలో దాదాపు మౌనంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అకస్మాత్తుగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలకు కేంద్ర బిందువుగా ఎదిగే ప్రయత్నం ప్రయత్నించారు.
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కొద్దిమంది ప్రతిపక్ష నేతలతో ఫోన్ లో మాట్లాడి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గురించి చర్చలకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో మమతా నేరుగా ఈ నెల 15న ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయమై ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలతో టెలిఫోన్ లో మాట్లాడిన సోనియా గాంధీ అదేరోజున శరద్ పవర్, స్టాలిన్ వంటి కొందరు యుపిఎ, వామపక్షాలకు చెందిన సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. బహుశా ఈ భేటీ విషయంలో తనను నిర్లక్ష్యం చేశారని కావచ్చు మమతా అదేరోజు మరో భేటీ జరపడం ప్రతిపక్ష శిబిరంలో కల్లోలం సృష్టింప నున్నది.
రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్ 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి వారిని హాజరుకావాలని మమతా బెనర్జీ దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
విస్తృత చర్చలు జరగాల్సిన నేపథ్యంలో మమత ఏకపక్షంగా విపక్షాల సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ఐకమత్యం రాకపోగా దానికి వ్యతిరేకంగా జరగొచ్చని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. ‘సాధారణంగా ఇలాంటి ఏకాభిప్రాయ స మావేశాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు సాగుతున్నాయి. చర్చలకు తేదీ కూడా ఖరారైంది. ఇప్పుడు మమత ఏకపక్షంగా లేఖ రాశారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటుంది’ అని ఆయన హెచ్చరించారు.
బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మమతా స్పష్టం చేశారు. పైగా, విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తన లేఖలో పేర్కొనడం ద్వారా ఈ సమావేశం ఉద్దేశ్యం రాష్ట్రపతి ఎన్నికకు పరిమితం కాదని ఆమె స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
ఇక, 22 మంది విపక్ష నేతలు, సీఎంలకు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మమత లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, హేమంత్ సొరెన్, భగవంత్ మాన్లు ఉన్నారు.
సోనియా గాంధీ చొరవ చూపితే అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ వంటి వారు స్పందించే అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థి ఎవ్వరికీ వారు మద్దతు ఇచ్చే ప్రశ్న తలెత్తదు. అటువంటప్పుడు బిజెపి అభ్యర్ధికి బలమైన పోటీ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకనే మమతా చొరవ తీసుకోవడం ద్వారా ఉమ్మడి ప్రతిపక్షాల సారధ్యం నుండి సోనియాను దూరంగా నెట్టేసినట్లు అయింది. యుపిఎ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారినట్లయింది.
ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి అంటూ కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ తీరా ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మౌనంగా మారడం గమనార్హం. ఇప్పుడు మమతా ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావడం తప్పనిసరి కాగలదు.