బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు మాజీ ఉప ప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి అయితే పలు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం కావడంతో పవార్ అయితే అందరికి ఆమోదయోగ్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి శరద్ పవార్ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధి ప్రతినిధిగా కలిసిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు పవార్ తన సమ్మతిని వ్యక్తం చేసిన్నల్టు చెబుతున్నారు. వాస్తవానికి ఆయన ఆదివారం సోనియా గాంధీతో భేటీ కావలసి ఉంది. అయితే ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో సాధ్యం కాలేదు.
మరోవంక, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సహితం ఆదివారం పవార్ ను కల్సి ఎన్నికలలో పోటీచేయవలసిందిగా అభ్యర్ధించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయన అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, టి ఆర్ ఎస్ అధినేత చంద్రశేఖర రావు వంటి వారు కూడా పవార్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.
కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారికి కాంగ్రెస్ అభ్యర్థిని సమర్ధించడంలో రాజకీయంగా చిక్కులు ఉండడంతో, కాంగ్రెసేతర అభ్యర్థి పట్ల మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రస్తుతం తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బిజెపికి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు తాము కలసి ఉన్నామనే సంకేతం ఇవ్వడానికి అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెట్ట వలసి ఉంది. 2017లో కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ కు కేజ్రీవాల్, కేసీఆర్ లతో పాటు అప్పట్లో కాంగ్రెస్ తో బీహార్ లో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ కూడా మద్దతు ఇవ్వలేదు.
మరోవంక, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై బిజెపి కసరత్తు ప్రారంభించింది. మొదటగా ఈ విషయమై ఏకాభిప్రాయం సాధించడం కోసం ప్రయత్నాలు చేపట్టింది. ఈ విషయమై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు, యుపిఎ, ఇతర రాజకీయ పక్షాలు, స్వతంత్రులతో చర్చలు జరపడం కోసం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాలను బిజెపి నియమించింది.