గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు అడుగుతోంది న్యాయంగా పరిహారం ఇవ్వమంటే లాఠీలతో, పైపులతో పోలీసుల ద్వారా కొట్టిస్తవా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
కొట్టుకుంటూ నిర్వాసితులను పోలీసులను ఈడ్చుకుంటూ పోతారా? అసలు నిర్వాసితులు, ఆ గ్రామస్తులు చేసిన పాపమేంది? టీఆర్ఎస్ గూండాలను రైతులపైకి ఉసిగొల్పుతావా? ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ రాజ్యమా? అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం వారి పట్ల పగబట్టినట్లు వ్యవహరిస్తోంది మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు చట్టపరంగా అందాల్సిన పరిహారం ఇవ్వకుండా వాళ్లపై దాడి చేయించడం దారుణం అంటూ ధ్వజమెత్తారు.
మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులని చూడకుండా గత 3 రోజులుగా వేటాడి వెంటాడి కొడతారా? మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావా?… చట్టాలను కాల రాస్తావా? అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు.
నిన్నటి దాకా భూ నిర్వాసితులను దేవుళ్లన్నవ్.. త్యాగాలను మరవలేనన్నవ్… ప్రాజెక్టు ఉన్నంత కాలం భూ నిర్వాసితుల పేర్లను చిరస్థాయిగా ఉంటానన్న నీ మాటలేమమైనయ్? అంటూ కేసీఆర్ ను సంజయ్ ప్రశ్నించారు.
వెంటనే హుస్నాబాద్ గూడాటిపల్లె, హుస్నాబాద్ లో పోలీసు బలగాలను ఉపసంహరింపజేయాల్సిందే అని బిజెపి నేత స్పష్టం చేశారు. లేనిపక్షంలో జరగబోయే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నిర్వాసితుల పక్షాన చట్ట, న్యాయ పోరాటం చేస్తామని, వారికి పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటామని సంజయ్ స్పష్టం చేశారు .
ఇలా ఉండగా, పోలీసుల దాడిలో గాయపడిన గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు చికిత్స అందించేందుకు సిద్దిపేట జిల్లా గుడాటిపల్లికి బుధవారం బిజెపి డాక్టర్ సెల్ బృందం బయలుదేరింది. బుధవారం రోజు ఉదయం 11 గంటలకు సర్పంచ్, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు గుడాటిపల్లిలో పోలీసుల దమనకాండలో గాయపడ్డ గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులతో కలిసి రాష్ట్ర గవర్నర్ ను బండి సంజయ్ ఆధ్వర్యంలోని పార్టీ ప్రతినిధి బృందం కలవనున్నది.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గౌరవెల్లి బాధితులతో కలిసి మానవ హక్కుల కమిషన్ ను బిజెపి లీగల్ సెల్ బృందం కలుస్తుంది. సాయంత్రం గౌరవెల్లి చేరుకుని పోలీసులు దాడిలో గాయపడ్డ బాధితులతోపాటు ప్రాజెక్టు నిర్వాసితులతో బిజెపి లీగల్ సెల్ బృందం మాట్లాడుతుంది.
