త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది.
అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందని భరోసా వ్యక్తం చేశారు.
‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి.
టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్‌కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం. త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.
‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్ ప్రధాన పాత్ర పోషించనుంది’’ పేర్కొన్నారు. అయితే కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి చెప్పారు.
అగ్నిపథ్‌ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.