రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వం విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ పవార్ ఆసక్తి చూపించకపోవడంతో మరో అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించారు.
ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో జరిపిన సమావేశంలో ఓ నిర్ణయానికి రాలేక పోయినా రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ రెండు పేర్లను ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. అవి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ – రాజగోపాలాచారిల మానవుడు గోపాలకృష్ణ గాంధీగా ప్రకటించారు. వామపక్షాలు అయితే గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతున్నాయి.
సమావేశం అనంతరం మమత మాట్లాడుతూ.. అభ్యర్థి విషయమై మళ్లీ భేటీ అవుతామని, ఏకాభిప్రాయాలున్న పార్టీలు ఒకే తాటిపైకి రావడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు శరద్ పవార్ ముందే విముఖత వ్యక్తం చేసినా సమావేశంలో మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే, క్రియాశీలక రాజకీయాల్లో ఇంకా కొనసాగాల్సి ఉందని పేర్కొంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు.
2017లో సహితం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరునే వామపక్షాలు తెరపైకి తీసుకు వచ్చినా, బిజెపి ఎస్సీ అభ్యర్థిని చివరి క్షణంలో ప్రకటించడంతో కాంగ్రెస్ నేత మీరాకుమారిని అభ్యర్థిగా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఎం వెంకయ్య నాయుడుపై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ పోటీ చేశారు. ఆయన గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేయడంతో వామపక్షాలకు సన్నిహితుడిగా పేరొందారు.
దాదాపు రెండు గంటలసేపు జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎవ్వరి పేరును ప్రతిపాదించగా పోయినా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఒకే అభ్యర్థి పోటీలో ఉండాలనే విషయంలో సమావేశం ఏకాభిప్రాయంకు వచ్చింది. మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, జేడీ(ఎస్), జేఎంఎం, శివసేన, వామపక్షాలతో సహా 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అయితే, ఆప్, టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్, ఒడిశా అధికార పార్టీ బీజేడీ గైర్హాజరయ్యాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాతే ఆప్, టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ మద్దతు ఇచ్చే విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్జే, జైరాం రమేష్, రణ్‌దీప్ సూర్జేవాలా, జేడీఎస్ నుంచి హెచ్డీ దేవెగౌడ, హెచ్డీ కుమారస్వామి, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నుంచి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.