జమ్మూ-కశ్మీరులో శాంతికి భంగం కలిగించాలని పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఆయన బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్‌ను వెయ్యి ముక్కలు చేసి, రక్తపు మడుగులో ముంచాలనేది పాకిస్థాన్ వైఖరి అని చెప్పారు.
భారత్ వేయి ముక్కలు చేసి రక్తపాతం సృష్టించాలన్నదే పాకిస్థాన్ సైనిక సిద్ధాంతం. భారత దేశంపై పరోక్ష యుద్ధం చేయాలనేది ఈ సిద్ధాంత సారాంశం అని ఆయన మండిపడ్డారు. అనేక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులతో యుద్ధం చేయాలనేది పాకిస్థాన్ వ్యూహం అని స్పష్టం చేశారు.
మన పొరుగు దేశం (పాకిస్థాన్) నిరంతరం భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలను మనం ఎదుర్కొన్నామని చెప్పారు. భారత దేశాన్ని వెయ్యి ముక్కలు చేసి, రక్తమోడేలా చేయాలనే సిద్ధాంతంతో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించారు.
దేశ ఐకమత్యం, సమగ్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే, భద్రతా దళాలు పాకిస్థాన్‌కు దీటుగా సమాధానం చెబుతాయని రక్షణ మంత్రి హెచ్చరించారు. రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజులపాటు జమ్మూ-కశ్మీరులో పర్యటించి, భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు.