ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శనివారం తన 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో తన తల్లి హీరాబెన్ మోదీని కలిసి, కాళ్లను కడిగిన మోదీ ఆ నీళ్లను కళ్లకు అద్దుకున్నారు. అనంతరం తల్లికి మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
మరోవైపు హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ తో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తోంది. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్‌కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. అదే ఆమె ఆరోగ్య రహస్యం కావచ్చు.
ప్రధాని మోదీ తల్లి ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. తాను తినే ఆహారాన్ని తానే వండుకోవడానికి ఇష్టపడుతుంటారని సమాచారం. ఎక్కువ మసాలా, నూనె ఉన్న ఆహారాన్ని ఆమె తీసుకోరు. అన్నం, కిచిడి, చపాతి, పప్పు వంటివి ఆమె ఆహారంలో ఉంటాయి. స్వీట్స్ విషయానికి వస్తే షుగర్ క్యాండీని ఆమె ఇష్టపడతారట.
చక్కెర మిఠాయి తినడానికి ఆమె ఇష్టపడతారని చెబుతుంటారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా మంది ప్రజలు భయపడినప్పుడు, మోదీ తల్లి వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ఈ వయస్సులో, ఆమె వ్యాక్సిన్ పొందడం ద్వారా ప్రజల మనస్సులోని భ్రమలను తొలగించడానికి ప్రయత్నించారు.
ప్రస్తుతం మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను ఆయన సందర్శించనున్నారు. తల్లి హీరాబెన్ పుట్టినరోజు సందర్భంగా మొదట గాంధీనగర్‌లోని తన ఇంటికి చేరుకుని.. తల్లికి హీరాబెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె పక్కనే కూర్చున్న మోదీ.. కాసేపు హీరాబెన్‌తో మాట్లాడి బాగోగుల గురించి తెలుసుకున్నారు. అనంతరం, ఇద్దరూ కలిసి అల్పాహారం సేవించారు.
ఇదిలా ఉండగా.. హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా కీలక ప్రకటన చేశారు. రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీంతో, ఆమె జీవితం గురించి తర్వాతి తరం స్పూర్తి పొందుతారని స్పష్టం చేశారు.