ఈ నెల 23న సర్వసభ్య సమావేశం జరగవలసి ఉండగా, అన్నాడీఎంకేలో నాయకత్వ సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంటుంది. ‘ఏకనాయకత్వ’ పేరుతో మొత్తం సంస్థాగత వ్యవహారాలను హస్తగతం చేసుకొనేందుకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, వారి ఎత్తుగడలను అడ్డుకొనేందుకు మరో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) ప్రస్తుతం అమలులో ఉన్న `ద్వంద నాయకత్వం’ కొనసాగ వలసిందే అంటూ పట్టుబడుతున్నారు.
స్థానిక అడయార్ గ్రీన్‌వేస్ రోడ్డులో వున్న తన నివాసంలో ఈపీఎస్ మద్దతుదారులతో రహస్య మంతనాలు సాగించగా, స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓపీఎస్.. అక్కడికొచ్చిన తన మద్దతుదారులతో చర్చలు జరిపారు. శనివారం ఉదయం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య మండలి తీర్మానాల ఎంపిక కమిటీ సమావేశం జరుగుతుండగా ఓపీఎస్ హఠాత్తుగా అక్కడికి చేరుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న ఆయన మద్దతుదారులంతా పెద్ద సంఖ్యలో గుమికూడి ఓపీఎస్ కు జేజేలు పలికారు. అదే సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్ళిన మాజీ మంత్రి డి.జయకుమార్‌కు వ్యతిరేకంగా ఓపీఎస్ వర్గీయులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఎడప్పాడి వర్గీయులు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేస్తూ జయకుమార్ చుట్టూ రక్షణ వలయంగా నిలిచి పార్టీ కార్యాలయంలోపలకు తీసుకెళ్ళారు.
ఈ సందర్భంగా అన్నాడీఎంకే కార్యాలయం అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. అంతేగాక ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆ తర్వాత పార్టీ కార్యాలయం పైఅంతస్తులో సర్వసభ్యమండలి తీర్మానాల ఎంపిక కమిటీ సభ్యుల సమావేశం జరుగుతుండగా, దిగువ అంతస్తులో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు.
నిజానికి ఓపీఎస్ ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ సీనియర్లలో తక్కువ మంది మాత్రమే అక్కడికి వస్తున్నట్లు తేలడంతో .. ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పై అంతస్తులో సర్వసభ్యమండలి తీర్మానాల ఎంపిక కమిటీ సమావేశంలో పలువురు మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ సహా 12 మంది పాల్గొన్నారు.
కింది అంతస్తులో కొద్దిసేపు తన మద్దతుదారులతో మాట్లాడిన ఓపీఎస్.. ఆ తరువాత పై అంతస్తుకు వెళ్లి తీర్మానాల కమిటీ సభ్యుల వద్ద కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ద్వంద్వ నాయకత్వంపై తాను మాట్లాడుతుంటే ఈపీఎ్‌సతో సహా సీనియర్లు ఎవ్వరూ నోరు మెదపడం లేదెందుకని ఆయన నిలదీసినట్లు సమాచారం.
ద్వంద్వ నాయకత్వమేనని స్పష్టం చేస్తే పార్టీలో రచ్చ ఉండదు కదా? అంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఓపీఎ్‌సను సముదాయించిన సీనియర్లు.. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలను మాత్రం దాటవేశారు.
మరోవంక, సేలం, తిరువణ్ణామలై పర్యటనలను ముగించుకుని శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నగరానికి చేరుకున్న ఈపీఎస్.. రాత్రంతా తన మద్దతుదారులతో మంతనాలు సాగించారు. ఈ సమావేశం శనివారం వేకువజాము వరకూ సుదీర్ఘంగా కొనసాగింది. ఓపీఎస్ కు చెక్ పెట్టడంపైనే ఈ భేటీ చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం రేగుతున్న ఏకనాయకత్వ వివాదంతో ఓపీఎస్, ఈపీఎస్ ఎడమొహం, పెడమొహంగా వుంటున్నారు. దీంతో సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ల దాకా అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 23వ తేదీన సర్వసభ్య మండలి సమావేశం జరుగనుండగా, ఇప్పటి వరకూ తగిన ఏర్పాట్లే జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సర్వసభ్య మండలి తీర్మానాల ఎంపిక కమిటీ నిర్ణయించిన తీర్మానాలు సర్వసభ్యమండలి సమావేశంలో ప్రవేశపెట్టాలంటూ పార్టీ సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం తొలి సంతకం చేయాల్సి ఉంటుంది. మలి సంతకం ఎడప్పాడి పళనిస్వామి చేయాల్సి వుంటుంది. ఈ పరిస్థితుల్లో ఏం జరుగనుందోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఏకనాయకత్వంపై సాగుతున్న వివాదాన్ని పరిష్కరించే దిశగా శనివారం ఈపీఎస్, ఓపీఎస్ మధ్య రాజీకుదిర్చేందుకు మాజీ మంత్రి సెల్లూరు కె.రాజు ప్రయత్నించారు. శుక్రవారం మాజీ ఎంపీ తంబిదురై ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో శనివారం సెల్లూరు రాజు రంగంలోకి దిగారు. అయితే ఇద్దరు నేతలు ఆయనతో ముభావంగానే మాట్లాడినట్లు సమాచారం.