తెలంగాణలోని ప్రతి పార్టీ కార్యకర్తను భాగస్వామిగా చేయడం ద్వారా జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను దిగ్విజయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జులై 3 సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్ కార్యకర్తలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారితోపాటు సామాన్య ప్రజలు కూడా బహిరంగ సభకు తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హోటల్ నోవాటెల్ ను ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు సంజయ్ సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్ఈసీ సమావేశ ఏర్పాట్ల జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ తోపాటు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా తరువాత మొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించడం గమనార్హం. ఈ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 34 విభాగాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రజలంతా మార్పు కోరుకుంటున్న సమయంలో, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పన్నుల భారం మోపుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను రాచి రంపాన పెడుతున్న సందర్భంలో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, లాఠీఛార్జీలు చేసినా బెదరకుండా బిజెపి ధీటుగా పోరాటాలు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రజల్లో బీజేపీ పట్ల మరింత బిశ్వాసం పెంపొందించడానికి కార్యవర్గ సమావేశాలు జరగుతున్నాయని సంజయ్ చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 50 వేల మంది నుండి నిధిని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి వెయ్యి రూపాయలు, మండల, జిల్లా, రాష్ట్ర నేతల వరకు రూ. లక్ష చొప్పున నిధిని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాపారస్తులు ఎవరైనా లక్షకు మించకుండా విరాళం ఇవ్వవొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగదును స్వీకరించబోం. డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే విరాళాలు సేకరిస్తామని స్పష్టం చేశారు.