కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ జూన్ 12న కరోనా సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంట్లోనే మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సోనియాకు సూచించినట్లు ఆయన తెలిపారు.
కాగా మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాల్సి ఉంది జూన్ 8న ఆమెను ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. అయితే జూన్ 1న సోనియాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈడీ నుంచి సమయం కావాలని కోరారు.
ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో జూన్ 23న ఏజెన్సీ ముందు హాజరు కావాలని సోనియా గాంధీకి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. మరోవైపు నాలుగో రోజైన సోమవారం రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. నాలుగు రోజుల్లో దాదాపు 40 గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. ఇక మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రాహుల్ కు ఈడీ సూచించింది.