ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని, యోగా ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటు జీవన విశ్వాసం ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మైసూర్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ఫర్ హ్యుమానిటీ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం యోగా ప్రపంచ నలుమూలలా విస్తరించిందని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని గుర్తు చేశారు.
కరోనా విపత్తు సమయంలోనూ యోగా నిర్వహించామని, సమాజంలో శాంతి నెలకొల్పుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. వ్యక్తికే పరిమితం కాదని సక్రమంగా మానవాళికి ఉపయుక్తంగా ఉందని సూచించారు.
యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని చెబుతూ ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు యోగా సందేశాన్ని చేరవేస్తున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు యోగా దోహదం చేస్తుందని ప్రధాని చెప్పారు.
దేశవ్యాప్తంగా జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. 75 నగరాల్లో వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి భవన్లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని ఆసనాలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో సీఎం కేజ్రీవాల్, ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.