ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ,,7,660 కోట్ల పంచాయతీల నిధులను దొంగిలించి వేసిందంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు వ్రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులు (2018 నుంచి 2022 వరకు) రూ 7,660 కోట్లను సర్పంచులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, తన సొంత పథకాలకు, అవసరాలకు వాడేసుకుందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు.
సర్పంచుల చెక్కుల పై సంతకాలు లేకుండా, సర్పంచులకు చెప్పకుండా, గ్రామ పంచాయతీల, గ్రామ సభల తీర్మానాలు లేకుండా పంచాయితీ సర్పంచ్ ల సిఎఫ్ఎంఎస్ అకౌంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని దొంగిలించి వేసిందని ఆయన పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీల అకౌంట్లు జీరో/ నిల్ బ్యాలెన్స్ లు చూపించడంతో సర్పంచులు షాక్ కు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు, డ్రైన్లు, శానిటేషన్ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోమని కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి వేసి తన సొంత పథకాలకు, అవసరాలకు వాడి వేసుకుందని ఆయన ధ్వజమెత్తారు.
ఇది 14, 15 వ ఆర్థిక సంఘాల నిబంధనలకు వ్యతిరేకం అని, ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం, న్యాయ వ్యతిరేకం, నైతిక విరుద్ధమైన దారుణమైన చర్య అని స్పష్టం చేశారు. దీనితో గత మూడు సంవత్సరాలుగా 12,918 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన తెలిపారు.
దీనితో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయి, సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయారని, గ్రామీణ ప్రజలు పనులు చేయడం లేదని సర్పంచులను నిలదీస్తున్నారని, తిడుతున్నారని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ రూ,,7660 కోట్ల ను హైజాక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడేసుకుంటోందని ఆరోపించారు.
కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ నిధుల మళ్లింపు పై విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించి, తగిన చర్యలు తీసుకొని, దొంగిలించిన ఆ రూ,, 7,660 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు – సర్పంచులకు తిరిగి ఇప్పించాలని ఆయన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి మోరేశ్వర్ పాటిల్, కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్ కుమార్ లకు విజ్ఞప్తి చేశారు.