ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తాజాగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పేరు వినిపిస్తోంది. గతంలో బీజేపీలో మంత్రిగా చేసిన యశ్వంత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నారు. అయితే ఆ పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోనున్నట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై చర్చించినా.. ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా యశ్వంత్.. చేసిన ట్వీట్ తో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ఆలోచిస్తే.. విపక్షాల తరపు నుంచి యశ్వంత్ సిన్హా బరిలో దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
టీఎంసీ ప్రస్తుత ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్ వేదికగా ప్రకటించారు. “టీఎంసీలో మమతా గారు(మమతా బెనర్జీని ఉద్దేశించి..) నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుండి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా”అంటూ ట్వీట్ చేశారు ఆయన.
రాష్ట్రపతి పదవికి పోటీపడేందుకు ముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును ప్రస్తావించగా అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సైతం పోటీ చేయలేనని తప్పుకున్నారు.
అనంతరం బెంగాల్ మాజీ గవర్నర్, మహత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును టీఎంసీ చీఫ్ మమత ప్రతిపాదించగా, ఆయన కూడా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. మొత్తం ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
అయితే అనూహ్యంగా యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది. ఇంతకు ముందు బిజెపిలో సీనియర్ నేత అయిన 85 ఏండ్ల సిన్హా ఆ తరువాత ప్రధాని మోదీతో విభేదించి పార్టీ వీడారు. చాలా కాలంగా సిన్హా ప్రతిపక్ష తరఫు రాష్ట్రపతి సీనియర్ తురుఫు ముక్క అనే ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఇప్పుడు ఆయన పేరును సోమవారం పలువరు నేతలు ఫోన్ల ద్వారా మమత బెనర్జీ ముందుకు ప్రధానంగా తెరపైకి తీసుకువచ్చారు. ఆమెకు కూడా సిన్హాను పోటీకి దింపాలనే ఆలోచన ఏర్పడింది. ఈ లోగా రాష్ట్రపతి అభ్యర్థి ఏ పార్టీలో సభ్యులు కారాదని కాంగ్రెస్, వామపక్షాలు చెప్పడంతో ఆయన టిఎంసికి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది.