మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన శివసేన తిరుగుబాటు నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో సూరత్‌ను విడిచిపెట్టి బుధవారం ఉదయం గౌహతికి చేరుకున్నారు. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్లో బస చేసిన 34 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు ఏక్నాథ్ షిండేతో కలిసి గౌహతి నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ కు వచ్చారు.
సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్లో బస చేసిన దాదాపు శివసేన ఎమ్మెల్యేలను బుధవారం తెల్లవారుజామున విమానంలో గౌహతికి తరలించారు. ‘ ‘మేం బాలాసాహెబ్ థాకరే శివసేనను విడిచిపెట్టలేదు…మేం బాలాసాహెబ్ హిందుత్వను అనుసరిస్తున్నాం. దానిని మరింత ముందుకు తీసుకువెళతాం’’ అని ఏక్నాథ్ షిండే సూరత్ విమానాశ్రయంలో విలేకరులతో స్పష్టం చేశారు.
తనతో పాటు 40 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని, మరో 10 మంది ఎమ్యెల్యేల మద్దతు తనకు ఉన్నదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం లేదని, కేవలం తిరిగి బిజెపితో పొత్తు ఏర్పరచుకొని, ప్రభుత్వంలో శివసేన కొనసాగాలని మాత్రమే కోరుకొంటున్నామని ఈ సందర్భంగా ఆయన తన ప్రధాన డిమాండ్ ను ప్రకటించారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్న ఎన్సీపీ, కాంగ్రెస్ లతో పొత్తు పట్ల శివసేన ఎమ్యెల్యేలు ఎవ్వరు సుముఖంగా లేరని కూడా స్పష్టం చేశారు. ఉద్ధవ్ థాకరే పంపిన శివసేన నాయకులు మిలింద్ నార్వేకర్, రవీంద్ర ఫాటక్ తిరుగుబాటుదారులతో సూరత్ హోటల్లో చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ వ్యవహారంపై మాజీ శివసేన నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె స్పందిస్తూ మైనారిటీలో పడిపోయిన ఉద్ధవ్ సర్కార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఎక్నాథ్ షిండే శివసేన పార్టీలో అగ్ర నాయకుడు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు అత్యంత విశ్వాసపాత్రుడు. మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఒకదశలో ఎంవిఎ ప్రభుత్వానికి ఆయనే నాయకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎన్‌సిపి అధినేత షిండే ముఖ్యమంత్రిత్వాన్ని వ్యతిరేకించడంతో ఉద్దవ్ థాక్రే పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో ఎంవిఎ ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిత్వ బాధ్యతలను ఏక్‌నాథ్‌కు అప్పగించారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపిగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.
అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సిఎం ఉద్దవ్ ఠాక్రే, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కూడా షిండే కొంత అసంతృప్తికి కారణమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.