తనను గద్దె దింపడం కోసం `తిరుగుబాటు’ ఎమ్యెల్యేలు సూరత్, గౌహతిలకు వెళ్ళవలసిన అవసరం లేదని, తన ముందుకు వచ్చి అడిగితే తాను ఆనందంగా చేస్తానని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. గౌహతిలో మకాం వేసిన సీనియర్ పార్టీ నేత, తిరుగుబాటు నేత తనతో 40 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని ప్రకటించడం, తమదే నిజమైన శివసేన అంటూ గవర్నర్ కు 34 మంది ఎమ్యెల్యేలు లేఖ వ్రాయడంతో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన థాకరే భావోద్వేగానికి గురయ్యారు.
ఆ తర్వాత కొద్దీ సేపటికే అధికార నివాసం ఖాళీచేసి తన సొంత ఇల్లు `మాతృశ్రీ’కి చేరుకున్నారు. తన తర్వాత ఏ శివ సైనికుడు సీఎం అయినా తనకు సంతోషమని స్పష్టం చేస్తూ, శివసైనికులారా మోసం చేయవద్దని ఆయన సూచించారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. శివసేన అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సైతం తాను సిద్ధమని తెలిపారు.
ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతూ తాను చేసిన తప్పేమిటో చెప్పాలని రెబెల్ నేతలను ప్రశ్నించారు. చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్నాథ్ షిండేను ఆహ్వానిస్తూ “నేను నమ్మకద్రోహానికి గురయ్యాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తనతో ఏక్నాథ్ షిండే నేరుగా మాట్లాడాలని కోరారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనని పేర్కొంటూ “శివసేన పార్టీని నడిపేందుకు నేను పనికిరానని చెప్పండి.. పార్టీ నుంచి తప్పుకుంటా. పదవులు వస్తాయి.. పోతాయి. అధికారం కోసం నేను పాకులాడటం లేదు” అని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
‘హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన. దేశంలో టాప్-5 సీఎంలలో నేను ఒకడిని. బాల్‌థాక్రే వారసత్వాన్ని కొనసాగించేది మేమే. నేను ప్రజల్ని కలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. కరోనా వల్ల ప్రజలను కలవలేక పోతున్నా. ఇప్పుడు ఉత్పన్నమైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని సీఎం పేర్కొన్నారు.
’30 ఏళ్లుగా మేము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించాం. కానీ శరద్‌పవార్.. నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు. ఆ సమయంలో ఓ సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా. ఎన్సీపీ, కాంగ్రెస్ నాకు పూర్తి సహకారం అందించాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యా’ అంటూ ప్రస్తుత కూటమి ఏర్పాటు నేపధ్యాన్ని వివరించారు.
హిందుత్వం గురించి మాట్లాడుతున్న తొలి సీఎంను తానేనని తెలిపారు. బాల్ థాక్రే ఆశయాలను, బాలసాహెబ్ ఆలోచనలనే ముందుకు తీసుకెళుతున్నామని స్పష్టం చేశారు. ఏ వైఫల్యాలు ఉన్నా తనతో చర్చించాలని.. అనంతరం నిర్ణయం తీసుకుందామని ఆయన రెబల్ వర్గానికి సూచించారు.