శివసేన ఎమ్యెల్యేల మీదనే కాకుండా, పార్టీపై కూడా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే పట్టు కోల్పోయిన్నట్లు కనిపిస్తున్నది. తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండే బలం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో, థాకరే శిబిరం ఉనికి కోల్పోతున్నది. ఇక ఆయన ప్రభుత్వ పతనం అనివార్యంగా కనిపిస్తున్నది.
అసోం గౌహతిలో రాడిసన్ బ్లూ హోటల్లో ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల శిబిరంలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 మందికి చేరినట్టు తెలుస్తోంది. షిండేతో సహా 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ కు థాకరే వర్గం సిఫారసు చేసినా ఫలితం కనిపించడం లేదు.
శాసనసభలో విప్ ధిక్కరిస్తే అనర్హత అంశం తెరపైకి వస్తుంది గాని, పార్టీ సమావేశాలకు వర్తించదని అంటూ ఓ ట్వీట్ లో ఎకనాథ్ షిండే ఎద్దేవా చేశారు. ఇటువంటి చర్యలతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. గురువారం సీఎం ఉద్దవ్ థాకరే ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం 13 మంది ఎమ్యెల్యేలే హాజరయ్యారు. 10 మంది ఎంపీలు కూడా షిండే గ్రూపులో చేరినట్లు తెలుస్తోంది.
ఏక్ నాథ్ షిండేను లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్న రెబెల్ ఎమ్యెలు తామే అసలైన బాల్ థాకరే వారసులమని, అసలు శివసేన పార్టీ తమదే అని స్పష్టం చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా ఎకనాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమని ఎన్సీపీ, కాంగ్రెస్ సంకేతాలు పంపినా, షిండే ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తాము `సిద్ధాంత పోరాటం’ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం తిరుగుబాటు శిబిరంలో షిండే వెంట శివసేనకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవాలంటే షిండేకు 37 మంది ఎమ్మెల్యేలు అవసరం..తమకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు షిండే వర్గీయులు చెబుతున్నారు.
తిరుగుబాటుకు ఓ జాతీయ పార్టీ మద్దతు
కాగా తమ తిరుగుబాటుకు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు షిండే పరోక్షంగా వెల్లడించారు. గౌహతిలోని ఒక హోటల్లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి షిండే చేసిన ప్రసంగానికి సంబంధించిఆయన కార్యాలయం గురువారం ముంబయిలో విడుదల చేసిన వీడియో ఆ అంశాన్ని స్పష్టం చేసింది.
ఆ వీడియోలో ఉద్దవ్ నేతృత్వంలోని ‘సంకీర్ణ ప్రభుత్వంపై మన తిరుగుబాటును ఒక జాతీయ పార్టీ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది. మనకు అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది’ అని అనుచర ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.
‘మన ఆందోళనలు, ఆనందాలు ఒక్కటే. మనం ఐక్యంగా ఉన్నాం. విజయం మనదే. ఒక జాతీయ పార్టీ ఉంది. చాలా శక్తివంతమైనది (మహాశక్తి)..మీకు తెలుసు వాళ్లు పాకిస్థాన్‌ను జయించారు. మనం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అభినందించింది. అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చింది’ అని ఆ వీడియోలో షిండే ప్రకటించారు. తమ తరపున తదుపరి నిర్ణయం తీసుకునే అధికారాన్ని షిండేకి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు తీర్మానించడం కూడా అదే వీడియోలో ఉంది.