ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఒడిశా నుండి ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన ఆమె ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆమె వెంట ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల నేతలు ఉన్నారు. ఆమె నామినేషన్ పత్రాలను ప్రధాని మోది రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముర్ము అభ్యర్థిత్వం కోసం బిజెపి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది..
వీటిపై ప్రధాని మోదీతో పాటు సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంతకాలు చేశారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేందర్ సింగ్ పటేల్‌తో సహా బిజెపి నేతృత్వంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ మహిళలు, గిరిజన ఎంపిలు, బిజెపి ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
ఎన్డిఎతో పాటు కూటమిలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన విజయసాయి రెడ్డి, బిజెడి నేత సుస్మిత కూడా ఆమె నామినేషన్‌కు మద్దతు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వం, ఎం.తంబి దొరై, జేడీ-యూ రాజీవ్ రంజన్ సింగ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్‌కు ముందు కీలకమైన విపక్షనేతలకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో ఆమె మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ముర్ము కోరారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలూ ముర్ముకు శుభాభినందనలు తెలియజేశారు.
మరోవంక, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కూడా కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్పీఎఫ్ సాయుధ కమాండోల రక్షణ కల్పించింది. యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ సహా 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి.