వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందుకోసం జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుప తలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆసరా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికి బలమైన సందేశం వినిపించేందుకు సమాయత్తం అవుతున్నది.
బిజెపి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ తెలంగాణ బిజెపి రూపొందించిన వెబ్ సైట్ ను శనివారం ఆవిష్కరిస్తూ ఇకనుండి కేసీఆర్ ప్రభుత్వం రోజులు దగ్గర పడినట్లే అని స్పష్టం చేశారు. మరోవంక, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇతర రాష్ట్రాల నేతలను నియోజకవర్గాల ఇన్ చార్జులుగా నియమించింది.
ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల్లో వీరి కింద మరో నేత కూడా ఉంటారు.
కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి కీలక నేతలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మిగతా నాయకులు ఈ నెల 28 నుంచే పర్యటనలు చేయనున్నారు. వీరందరూ అక్కడే బస చేయడంతో పాటు కార్యకర్తల ఇండ్లలోనే భోజనాలు చేస్తారు.
వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కేంద్ర పథకాల అమలు, జులై 3 సాయంత్రం హైదరాబాద్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే బహిరంగ సభకు జన సమీకరణపై సమీక్ష చేస్తారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య సమన్వయం, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటారు. సమస్యలపై పోరాటానికి స్థానిక నేతలకు సూచనలు ఇస్తారు.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటికి ఇప్పటికే కోఆర్డినేటర్లను రాష్ట్ర పార్టీ నియమించింది. మోదీ సభకు జన సమీకరణ కోసమే వీరిని నియమించారు. వీళ్లతో సమన్వయం చేసుకుంటూ జాతీయ నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. జాతీయ నేతలు తర్వాత కూడా తరచూ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు.
వారు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ నియోజకవర్గ నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో వీరి నిర్ణయమే కీలకం కానుందని చెబుతున్నారు.
ఇలా ఉండగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు రానున్నారు. 1న నగరానికి రానున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 50 వేల మందితో ర్యాలీ చేయాలని చూస్తున్నారు.
కాగా 1, 2 తేదీల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు హైదరాబాద్ లో నివాసముంటున్న తమ రాష్ట్రాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి మద్దతు ఇవ్వాలని వాళ్లను కోరనున్నారు.