గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్ర మోదీకి ఆ అల్లర్లతో సంబంధం లేదని కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ, ఈ కేసులలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా దర్యాప్తులను పక్క దారి పట్టించారని అంటూ మోదీపై కేసులలో కీలకంగా వ్యవహరించిన వారిపై కఠినంగా పదజాలం ఉపయోగించడంతో మొత్తం కేసు కొత్త రూపు తీసుకున్నాయి.
సుప్రీం కోర్ట్ తీర్పు తనపై చేసిన వాఖ్యాలను ఆసరాగా చేసుకొని, ఆ మరుసటి రోజే తనపై గుజరాత్ పోలీసులు మరో కేసు నమోదు చేసి, ఆ సాయంత్రానికల్లా అరెస్ట్ చేస్తారని సామజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అసలు ఉహించినట్లు లేదు. అందుకనే అరెస్ట్ తో ఆమె ఓ విధంగా షాక్ కు గురయ్యారు. గుజరాత్ అల్లర్ల కేసులో ఫోర్జరీ, నేరపూరిత కుట్ర దర్యాప్తు ప్రక్రియను అవమానించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను క్కూడా ఏర్పాటు చేసింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం డీఐజీ దీపన్ భాద్రాన్ దీనికి నేతృత్వం వహిస్తారు.
శనివారం ముంబైలో అదుపులోకి తీసుకున్న తీస్తా సెతల్వాడ్ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, మాజీ డిజిపి ఆర్ బి శ్రీకుమార్ తో పాటు కోర్టులో హాజరు పరిచారు. అహ్మదాబాద్ కోర్ట్ వారిని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సుప్రీం కోర్ట్ చేసిన వాఖ్యలపై న్యాయపోరాటం చేయడానికి ముందుగా, బెయిల్ పొంది బయటకు వచ్చే ప్రయత్నాలను ఆమె న్యాయవాదులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఆమె ముందు న్యాయపోరాటానికి ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందే రివిజన్ పిటిషన్ ను దాఖలు చేయాల్సి ఉంది. ఆ పిటిషన్ ను కొట్టివేసిన పక్షంలో, ఐదుగురు న్యాయమూర్తులు ఉండే విస్తృత ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలి. అయితే అందుకు ప్రధాన న్యాయమూర్తి అనుమతించ వలసి ఉంటుంది.
ప్రస్తుతం సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన జాకిర్ జాఫ్రి కేసులో సహా పిటిషనర్ దారునిగా వ్యవహరించడంతో పాటు గోధ్రా అల్లర్ల అనంతరం మోదీ ప్రభుత్వంలో అనేక కేసులు వేయడంలో తీస్తా సెతల్వాద్ క్రియాశీల పాత్ర వహించారు. ఆ సమయంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా ఉన్న ఆర్ బి శ్రీకుమార్ అల్లర్లపై నియమించిన విచారణ కమిషన్ లకు విద్వేషాలు కలిగించే ప్రసంగాలు మోదీ చేసారంటూ అఫిడవిట్ లను దాఖలు చేశారు.
1989లో జరిగిన నిర్బంధంలో మరణం కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పోలీస్ అధికారి సంజీవ్ భట్ గోధ్రా అల్లర్ల సమయంలో జరిగిన ఉన్నత పోలీస్ అధికారుల సమావేశంలో ప్రజలు తమ ఆగ్రవేశాలు వ్యక్తం చేసుకునే అవకాశాలు ఇవ్వమని అంటూ ముఖ్యమంత్రి మోదీ ఆదేశించారని అంటూ ఓ అఫిడవిట్ ను సమర్పించారు.