మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ తాను అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యానని, అనుకోకుండానే రాజీనామా చేస్తున్నానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. వాస్తవానికి తండ్రి బాల్ ఠాక్రే మొదటి నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. బాల్ ఠాక్రేకు సోదరుని కుమారుడు రాజ్ ఠాక్రే రాజకీయ వారసుడు కాగలరని చాలా మంది భావించారు. ఆయనే మొదటి నుండి రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు.
ఫోటోగ్రఫీ పట్ల అమితమైన ఆసక్తి పెంచుకున్న ఆయన ఎప్పుడు మరో ప్రపంచంలో ఉండేవారు. తండ్రి వలే ఎప్పుడు ప్రత్యర్థుల పట్ల పరుషమైన పదజాలం ఉపయోగించారు. సౌమ్యుడిగా పేరొందారు. ఆయనపై తిరుగుబాటు చేసిన ఎమ్యెల్యేలు సహితం ఆయన రాజీనామా పట్ల విచారం వ్యక్తం చేయడం, ఆయన పట్ల తమకు వ్యతిరేకత లేదనడం గమనార్హం.
2002లో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. 2002లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యుడిగా అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ ఎన్నికల్లో శివసేన మెరుగైన ఫలితాలు సాధించడంతో పార్టీలో ఉద్ధవ్ ప్రతిష్ట పెరిగింది.
2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా తన రాజకీయ వారసునిగా బాల్ ఠాక్రే నియమించారు. 2006లో పార్టీ పత్రిక ‘సామ్నా’ చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు కొనసాగారు.
2012లో బాల్ ఠాక్రే మరణించడంతో, 2013లో శివసేన అధినేతగా ఉద్ధవ్ ఠాక్రే పగ్గాలు చేపట్టారు. ఉద్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్రలో 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు.
మహా వికాస్ అఘాడీ పేరిట మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి శివసేన నుండి ముఖ్యమంత్రి పదవికి ఎకనాథ్ షిండే పేరును ఉద్ధవ్ ప్రతిపాదించారు. అయితే సోనియా గాంధీ, శరద్ పవార్ పట్టుబట్టడంతో మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి నాయకుడు ఉద్ధవ్ కావడం విశేషం. 2021లో 13 పెద్ద రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్టు పాపులర్ సీఎం’గా ఉద్ధవ్‌కు అత్యుత్తమ ర్యాంకు దక్కడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మంది మళ్లీ ఉద్ధవ్‌కే ఓటు వేస్తామని చెప్పారు.
మరాఠా పులి బాలాసాహెబ్ బాల్ ఠాక్రే–మీనా ఠాక్రే ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే 1960 జూలై 27న జన్మించారు. ముంబైలో బాలమోహన్ విద్యామందిర్‌లో పాఠశాల విద్య అభ్యసించారు.‘సర్ జె.జె.ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్’లో ఫొటోగ్రఫీ ప్రధాన సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఉద్ధవ్ ఠాక్రేకు చిన్నప్పటి ఫొటోగ్రఫీపై అమితాసక్తి. ఆయన తీసిన ఎన్నో ఫొటోలను ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రకృతి అందాలను, కోటలను ఆయన కెమెరాల్లో చక్కగా బంధించారు.
ఉద్ధవ్ 1989లో రష్మీ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఆదిత్య, తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివసేన యువజన విభాగం అధ్యక్షుడైన పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర కేబినెట్లో పర్యాటకం, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు తేజస్ ఠాక్రే పర్యావరణ పరిరక్షకుడిగా, వైల్డ్‌లైఫ్ పరిశోధకుడిగా కొనసాగుతున్నారు.