ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన తర్వాత పలు నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా, బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఆ వెంటనే సీఎం హోదాలో షిండే తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జూలై 2, 3 తేదీల్లో అసెంబ్లీని సమావేశపరచాలని తీర్మానించారు. తొలిరోజు సభలో స్పీకర్ ఎన్నిక, బలపరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్ గత ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.
ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడణవీ్సలను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తాజా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా షిండే, ఫడణవీ్సలకు అభినందనలు తెలియజేశారు.
తొలుత ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారని అందరూ భావించారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్ ను కలసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఫడ్నవిస్ ప్రకటించడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. బిజెపి నేతలు సహితం ఆశ్చర్యం చెందారు. పైగా, తాను ప్రభుత్వంలో చేరబోదని, బిజెపి చేరి ప్రభుత్వం సాఫీగా జరగడానికి సహకరిస్తుందని వెల్లడించారు.
అయితే, మరో రెండు గంటల తర్వాత ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా చేరాలని పార్టీ ఆదేశిస్తున్నట్లు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. బిజెపి పెద్ద మనస్సుతో తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినదని షిండే కృతజ్ఞతలు చెప్పారు.
తామే అధికారం కోసం శివసేనతో చీలిక తీసుకొచ్చి, తిరుగుబాటు ఎమ్యెల్యేలను ప్రోత్సహిస్తున్నామని ప్రచారంను తిప్పికొట్టడం కోసం, అట్టడుగు స్థాయి నుండి వచ్చిన ఓ శివసైనికులు ముఖ్యమంత్రి అయ్యారనే సందేశం ద్వారా శివసైనికుల మద్దతు కూడదీసుకోవడం కోసం బిజెపి ముఖ్యమంత్రి పదవిని షిండేకు అప్పచెప్పిన్నట్లు కనిపిస్తున్నది.
39 మంది ఎమ్యెల్యేలను షిండే చీల్చగలిగినా పార్టీ సంస్థాగతంగా ఇంకా థాకరే నాయకత్వంలో ఉంది. తమదే అసలైన శివసేన అని షిండే వర్గం చేస్తున్న వాదనలకు ఎన్నికల కమీషన్, న్యాయస్థానాలతో అవసరమైన మద్దతు కూడదీసుకోవడం కోసం వ్యూహాత్మకంగా బిజెపి ఈ ఏర్పాటు చేసినట్లు పలువురు భావిస్తున్నారు.
మహారాష్ట్రలో మరోసారి ఏక్ నాధ్ షిండేకి మద్దతు ఇచ్చి తాము అధికారంలో భాగస్వామి అవుతామని, తమ సంకీర్ణ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు గిరీష్ మహాజన్ అంతకు ముందు ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేపట్టడానికి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని, అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు.