ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఎన్నికలు జరిగినా వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి , అధికార అండతో లోబరుచుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకొనే ప్రయత్నం అధికార పక్షమైన వైసిపి చేస్తున్నట్లు బిజెపి నాయకుడు కారణం భాస్కర్ ఆరోపించారు. ఓటర్లతో చనువు ఏర్పాటు చేస్తుకుని, ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పులు అందిస్తూ వాటితో పాటుగా ఓటరు కు వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చిన డబ్బులను కూడా నేరుగా వారితోనే ఇచ్చే పధకం వేసుకున్నారని తెలిపారు.
ఒకొక్క ఓటరుకు రూ 10,000 వరకు ఇచ్చే ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి ప్రభుత్వాలు ఇచ్చే , వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వారి ద్వారానే జరగాలని ఒక మంచి ఉద్దేశం తోటి ఈ వ్యవస్థను ప్రారంభించినట్టుగా అందరం భావించామని ఆయన తెలిపారు.
మొదట ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నప్పుడే వైఎస్సార్సీపీ నాయకుడు విజయ్ సాయి రెడ్డి 94 శాతం వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే అని ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ దగ్గరకు ప్రజలు రావడం లేదని, అంతా వాలంటీర్లు చూసుకుంటున్నారని ఫిర్యాదులు చేస్తే మొన్ననే నెల్లూరులో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించిన వారే ఈ వాలంటీర్లు అన్నారని విస్మయం వ్యక్తం చేశారు.
పైగా,వారందరిని ఉపయోగించుకొని ఎన్నికలకు పోవాలని పార్టీ ప్లీనరీ సమావేశాలలో బహిరంగంగానే చెప్పారని భాస్కర్ ధ్వజమెత్తారు. .ఈ వాలంటీర్లు ఎన్నికల సమయంలో మెడలో వాలంటీర్ ట్యాగ్ వేసుకుని బూతులలోకి పోలీసుల దగ్గర, ఇతర అధికారుల దగ్గర వీరికి సర్వహక్కులు ఉన్నట్టుగా వ్యవహారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరైనా అడిగితే ప్రభుత్వం తమనును పోలింగ్ శాతం ఎక్కువ అయ్యేటట్లుగా ప్రచారం చేయమని చెబుతుంటారని తెలిపారు. వారు పోలింగ్ శాతం ఎక్కువ చేసే దాంట్లో భాగంగా అధికార పార్టీకి ప్రచారం చేస్తూ వారికి ఏ రకమైన సదుపాయాలు, అవసరం అయితే ఆ రకమైన సదుపాయాలు కల్పిస్తూ పూర్తిగా ప్రభుత్వ పార్టీకి ఉపయోగపడుతున్నారని ఆరోపించారు.
వీరి పనితీరును తాను తిరుపతి బద్వేల్ , ఆత్మకూరు ఉప ఎన్నికల్లో స్వయంగా గమనించానని భాస్కర్ చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు తమ తమ కార్యకర్తల గణంతో ఎన్నికలకు వెడుతుంటే, అధికార పార్టీ ఆ అవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఎన్నికల సమయంలో వీరిని కట్టడి చేయకపోతే మిగతా పార్టీలకు ఘోరమైన నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
ప్రజలలో, ప్రభుత్వం మీద, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వీరిని ఎన్నికలు వచ్చే మూడు నెలల ముందు వీరి విధులు ఆపకపోతే, తప్పించకపోతే, కట్టడి చేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని స్పష్టం చేశారు.