మహారాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌గా మామ, అసెంబ్లీ స్పీకర్‌గా అల్లుడు ఎన్నికై రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికైన బిజెపి నేత రాహుల్ నర్వేకర్, మండలి ఛైర్మన్‌గా రామ్‌రాజే నాయక్‌కు స్వయానా అల్లుడు. అయితే మామ మాత్రం ఎన్‌సిపి (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) కి చెందిన వ్యక్తి కాగా, అల్లుడు మాత్రం బీజేపీ నేత కావడం విశేషం.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ నర్వేకర్ (45) ఈ పదవిని చేపట్టిన పిన్న వయస్కుడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ముంబై లోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాహుల్ నర్వేకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శివసేన యూత్ విభాగం అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన 2014 లో పార్టీని విడిచిపెట్టి ఎన్సీపీలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే దూరం పెట్టడం వల్లే పార్టీని వీడిపోతున్నట్టు అప్పట్లో పేర్కొన్నారు. 2014లో మవాలా అసెంబ్లీ నుంచి పోటీ చేసిన నర్వేకర్ , శివసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరి, కొలాబా స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా ఏక్నాథ్ షిండే, బిజెపి మద్దతుతో అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. నర్వేకర్ సోదరుడు మాత్రం ప్రస్తుతం కొలాబా కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు.
నార్వేకర్ ఆదివారం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 164 ఓట్లు, ఆయన ప్రత్యర్థి రాజన్ సాల్వికి 107 ఓట్లు వచ్చాయి. ఏఐఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వ బల పరీక్ష కోసం ఆది, సోమవారాల్లో శాసన సభ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఆదివారం సభాపతి ఎన్నిక జరిగింది.
ఇలా ఉండగా, మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి ఆదివారంనాడు సీల్ వేశారు. కార్యాలయం వెలుపల నోటీసు అంటించారు. ”శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేశాం” అని ఆ నోటీసులో రాశారు.