ఆహార భద్రత చట్టం అమలులో ఒడిషా అగ్రస్థానంలో నిలివగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) రాష్ట్రాల ర్యాంకింగ్ ఇండెక్స్‌ను కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు. ఎన్ఎఫ్ఎస్ఎ అమలు తీరు, పురోగతి, వివిధ సంస్కరణలు ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు.
ఆహార భద్రత అమలులో జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఇండెక్స్‌లో స్కోరు 0.794తో ఏపి మూడోస్థానంలో నిలిచింది. 0.836 స్కోరుతో తొలి స్థానంలో ఒరిస్సా, 0.797 స్కోరుతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 0.743 స్కోరుతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. గోవా (0.631 స్కోర్) చివరి స్థానంలో నిలిచింది.
స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో త్రిపుర (0.788 స్కోర్), హిమాచల్ ప్రదేశ్ (0.758 స్కోర్), సిక్కిం (0.710 స్కోర్)లు మొదటి స్థానంలో నిలిచాయి. లడఖ్ (0.412 స్కోర్), మేఘాలయా (0.512 స్కోర్)లు చివరి స్థానంలో నిలిచాయి. అయితే జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు, స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ర్యాంకింగ్ల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది.
ర్యాంకుల విడుదల సందర్భంగా కేంద్ర పియూష్ గోయల్ మాట్లాడుతూ కేంద్రం వద్ద నిధులు అందుబాటులో లేనందునే ఆహార భద్రత రాయితీ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రేషన్‌కార్డు దారుడు రేషన్ తీసుకొనే స్వేచ్ఛను కల్పించడంతో సుమారు 45వేల కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు.
ఈ పథకం వలసదారులకు ఎంతో ఉపకరిస్తోందని పేర్కొన్నారు. 2019-20 పెండింగ్ బకాయిలు ఆగస్టు 15 లోగా క్లెయిమ్ చేసుకోవాలని, తదనంతరం 60 రోజుల్లో అక్టోబరు 15 లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు. సమయం ఎక్కువ తీసుకొనే రాష్ట్రాలకు ఎలాంటి వడ్డీ చెల్లించబోమని స్పష్టం చేశారు. ర్యాంకింగ్ విడుదల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు హాజరు కాకపోవడం విచారకరమని గోయల్ తెలిపారు.