బాలా సాహెబ్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాల పరిరక్షణ కోసమే తాము పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బిజెపి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఇతర పార్టీలు లాభపడుతూ, శివసేన నష్టపోతున్నదని చెప్పినా పట్టించుకొనక పోవడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో తిరుగుబాటు చేయవలసి వచ్చినదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
‘మహా వికాస్ అఘాడీ’ కూటమితో శివసేనకు జరిగిన నష్టమేంటి ?
మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో శివసేన ఉండటం మంచిది కాదనే విషయాన్ని నేను పార్టీ అధిష్ఠానానికి గతంలో ఎన్నోసార్లు చెప్పాను. సైద్ధాంతిక విబేధాలున్న పార్టీలతో పొత్తు మంచిది కాదని వారించాను. దీనిపై శివసేన ఎమ్మెల్యేలంతా బాధపడుతున్నారని కూడా వివరించాను. అయినా వినిపించుకోలేదు. పర్యవసానంగానే సీఎం పదవి మా చేతిలో ఉన్నా, నగర పంచాయతీ ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. దీనర్ధం మహా వికాస్ అఘాడీ సర్కారు వల్ల లబ్ధి శివసేనకు జరగలేదు.. ఇతర పార్టీలే లాభపడ్డాయి. శివసైనికులకు అన్యాయం, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
శివసేన ఎమ్మెల్యేలను రెబల్స్ గా మార్చిన పరిణామాలేంటి ?
సీఎం సీటు శివసేన చేతిలో ఉన్నా క్షేత్ర స్థాయిలో శివ సైనికులకు అవమానాలు ఎదురయ్యాయి. శివసేన ఎమ్మెల్యేల విలువను తగ్గించేలా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు కుట్రలు పన్నారు. ప్రభుత్వంలో మాకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. ఈ పరిణామాలన్నీ శివసేన ఎమ్మెల్యేల మనసు విరిచాయి. శివసేన అధినాయకత్వానికి ఈ విషయాన్ని తెలిపినా పరిస్థితులు మారలేదు. అందుకే మేమంతా ఏకమై పోరాడాలనే నిశ్చయానికి వచ్చాం. బాలా సాహెబ్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాల పరిరక్షణ కోసమే ఇదంతా చేశాం.
శివసేనపై మీ తిరుగుబాటు సరైన చర్యేనా ?
ముమ్మాటికీ సరైన చర్యే. మేం రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నాం. మా దగ్గర తగినంత మెజారిటీ ఉంది. మూడింట రెండో వంతు కంటే ఎక్కువ మెజారిటీయే ఉంది. స్పీకర్ కూడా మమ్మల్ని గుర్తించారు. మమ్మల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కిన వాళ్లకు కూడా చివాట్లే పడ్డాయి. రానున్న రోజుల్లోనూ కోర్టులు కూడా వాళ్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాయి. మాది బలమైన సర్కారు. ఎమ్మెల్యేల బలం ఉంది. అందరికీ న్యాయం ఇప్పిస్తాం.
బీజేపీపై మీ అభిప్రాయం ?
సర్కారు ఏర్పాటు కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బీజేపీ అధికారాన్ని కాంక్షించే పార్టీ కాదు. సైద్ధాంతిక విలువలకు అది కట్టుబడి ఉంటుంది. నైతిక విలువలు కూడా దానికి ఉన్నాయి. అందుకే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల బలమున్నా బల పరీక్షలో అండగా నిలిచింది. నాకు సీఎం పదవిని ఆఫర్ చేసింది. మహారాష్ట్రలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని స్వయంగా ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది.
పెద్దసంఖ్యలో రెబల్ ఎమ్మెల్యేలను ఏకం చేసిన అంశమేది ?
దాదాపు 5 మంది రెబల్ ఎమ్మెల్యేలం. మేం చిన్న చిన్న కారణాల కోసం కలువ లేదు.. దీని వెనుక ఒక పెద్ద లక్ష్యం ఉంది. అదే బాలా సాహెబ్ థాక్రే హిందూత్వ సిద్ధాంతాల రక్షణ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి శివసేన పోటీ చేసింది. కానీ శివసేన, కాంగ్రెస్ లతో చేతులు కలిపి సర్కారు ఏర్పాటు చేసింది. ఆ పరిణామం శివసేన ఎమ్మెల్యేలకు మింగుడు పడలేదు. ఆ కోపాన్ని ఇలా తిరుగుబాటు రూపంలో చూపించారు. బాలా సాహెబ్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాల కోసం ఏకమై గెలిచారు.