శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ చెప్పారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందించినట్లు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం శరణార్థ సంక్షోభం లేదని జైశంకర్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది, ఏం జరుగుతుందో వేచి చూడాలని చెప్పారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు.
‘మేము శ్రీలంకకు మద్దతుగా ఉన్నాం. వారికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వాళ్లు వారి సమస్యలతో సతమతమవుతున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి శరణార్థుల సంక్షోభం లేదు’ అని జైశంకర్ తెలిపారు.
సంక్షోభంతో అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అని, ఆయనే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత తీసుకోవాలంటూ లక్షల మంది నిరసనకారులు శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్న తమను దారుణమైన పరిస్థితిలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు.
44 వేల టన్నుల యూరియా సహాయం
ఇలా ఉండగా, ఆర్థిక సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకలోని రైతులను ఆదుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత్ ఆదివారం ఆ దేశానికి 44 వేల టన్నుటకు పైగా యూరియాను అందజేసింది. శ్రీలంకలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిసి 44 వేల టన్నులకు పైగా యూరియా శ్రీలంకకు చేరుకున్నట్లు తెలియజేశారు.
తమ దేశం గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ సాయం అందించాలని అమరవీర గత నెల బాగ్లేను కోరారు. కాగా శ్రీలంకలో ప్రస్తుత సాగు సీజన్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండడం కోసం తక్షణం 65 వేల టన్నుల యూరియాను సరఫరా చేస్తామని గత మేలో మన దేశం శ్రీలంకకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరినుంచి భారత్ శ్రీలంకకు వివిధ రూపాల్లో 300 కోట్ల డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత మన దేశం ఆ దేశానికి ఆహార వస్తువులు, మందులు, ఇంధనం, కిరోసిన్, ఇతర నిత్యావసరాలు సరఫరా చేయడం ద్వారా ఆ దేశాన్ని ఆదుకుంటోంది.
