పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమే కాకుండా బిజెపితో కలసి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి పదవి, అధికారంలతో పాటు కనీసం శాసనసభలో ప్రతిపక్ష నేత పదవి కూడా పొందలేక పోయిన ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన ఇప్పుడు కనీసం విధాన పరిషద్ లో ప్రతిపక్ష నేత పదవి కోసం కన్నేసినట్లు తెలుస్తున్నది.
అందుకై మహా వికాస్ ఆఘాడిలో శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లపై ఒత్తిడి చేయనున్నట్లు విధాన పరిషత్‌తో శివసేనకు చెందిన నూతన సభ్యుడు సచిన్ అహిర్ వెల్లడించారు. ఇటీవల శివసేన నేత ఏక్నాథ్ శిందే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తరువాత విధాన సభలో ప్రతిపక్ష పదవి నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్‌ను ఎంపిక చేశారు.
దీంతో కనీసం విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలని శివసేన డిమాండ్ చేస్తోంది. విధాన పరిషత్‌లో కాంగ్రెస్, ఎన్సీపీతో పోలిస్తే శివసేనకు సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం పట్టుబట్టేందుకు శివసేనకు వాతావరణం అనుకూలంగా ఉంది.
ఇరు పార్టీల కంటే శివసేనకు 13 మంది ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ఈ నెల చివరి వారంలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత పదవి తమకే కావాలని డిమాండ్ చేయనున్నట్లు అహిర్ పేర్కొన్నారు.షిండే తిరుగుబాటుతో పార్టీలో నెలకొన్న గందరగోళం వల్ల అనేక మంది శివసైనికుల ఆత్మస్ధైర్యం దెబ్బతింది. అయితే, అదే దూకుడు, ఉత్సాహం, ఊపుతో, మానసికంగా బలపడి శివసేన కొత్త పుంతలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తుందని సచిన్ అహిర్ ఆశాభావం వ్యక్తం చేశారు.