బ్యాంకు రుణాలను ఎగవేసి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో నాలుగు నెలల కారాగార శిక్షను విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే ఉద్దేశంతో కోర్టు ధిక్కరణకు పాల్పడిన నిందితునికి తగిన శిక్షను విధించక తప్పదని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంటూ మాల్యాకు రూ. 2,000 జరిమానా కూడా విధించింది.
తన యాజమాన్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ.9,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణ ఎగవేత కేసులో మాల్యా నిందితుడిగా ఉన్నారు. వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు తన ప్రవర్తనకు నిందితుడు ఎటువంటి క్షమాపణ చెప్పకపోవడం లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో నాలుగు మాసాల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తున్నట్లు తన ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది.
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తన పిల్లలకు 40 మిలియన్ అమెరికన్ డాలర్లు బదలీ చేసి కోర్టు ధిక్కార నేరానికి మాల్యా పాల్పడ్డారని 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా దీన్ని సమీక్షించాలని మాల్యా పిటిషన్ వేయగా 2020లో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2017మేలో తాము ఇచ్చిన తీర్పునకకు లోబడి మాల్యా, ఆయన పిల్లలు నాలుగు వారాలలో ఆ డబ్బును 8 శాతం వడ్డీతోసహా కోర్టు రికవరీ అధికారి వద్ద డిపాజిట్ చేయాలని సోమవారం ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది.
నాలుగు వారాలలో మాల్యా రూ. 2,000 జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఇలా ఉండగా, 2016 మార్చి నుంచి విజయ్ మాల్యా లండన్‌లో తలదాచుకున్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు 2017 ఏప్రిల్ 18న స్కాట్‌ల్యాండ్ యార్డ్ పోలీసులు వారెంట్ జారీచేయగా ఆయనకు అక్కడి కోర్టులో బెయిల్ లభించింది.