సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ” వైసిపి తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలి. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది” అని తెలిపారు.
మొదటి నుంచి వైసిపి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోందని పేర్కొంటూ ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని, ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని కోరారు. జులై 18న మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తామని చెప్పారు.
“మాక్‌పోలింగ్‌లో పాల్గన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలి. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారు. అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ” అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి గెలిపించాలని రాష్ట్రాని చెందిన ఎంపి, ఎంఎల్ఏలకు బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంగళవారం మధ్యాహ్నాం రాష్ట్రానికి వచ్చిన ఆమె వైసిపి, టిడిపి ప్రజా ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తన స్వరాష్ట్రమైన ఒడిషాతో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుబంధాన్ని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కొనసాగే సౌహార్ధ్రతను ఆమె గుర్తు చేసుకున్నారు.
ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారని తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ఆమె స్మరించారు. జాతీయోద్యమ కాలంలో కూడా ఈ ప్రాంతంనుండి ఎంతోమంది వీరోచిత పోరాటం చేశారని అన్నారు. వైసిపి, టిడిపిలు ఇప్పటికే తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తిని ఎంపిలు, ఎంఎల్ఏలు వ్యక్తిగతంగా కూడా కొనసాగించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు గిరిజన సంప్రదాయంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, బాలశౌరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేశ్, మాధవ్‌లు స్వాగతం పలికారు.
ద్రౌపది ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చారు. స్వాగత సత్కారాల అనంతరం ద్రౌపది ముర్ము నేరుగా తాడేపల్లిలోని జగన్ మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.