దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో, నీటి, విద్యుత్ సరఫరా స్థంభించిపోయింది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి.
భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా 14 మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయలయ్యారు. గుజరాత్‌లోనే ఏడుగురు మృతి చెందారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.
భారీ వర్షాల కారణంగా గుజరాత్ అతలాకుతలమయ్యింది. 24 గంటల వ్యవధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోడ కూలి ఏడుగురు మరణించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్ సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఉరుములు, వరదనీటిలో కొట్టుకొని పోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు కూలడం సహా పలు ఘటనల్లో రాష్ట్రంలో మొత్తంగా 64 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోనూ కుంభవృష్టి కురుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 52 జిల్లాలకు గాను, 33 జిల్లాలో అత్యంత భారీ వర్షపాతం నమోదయింది. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మహారాష్ట్రలో మొత్తం 27 జిల్లాలు, 236 గ్రామాలపై ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడింది.ఇప్పటివరకూ 5,873 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, పుణే, నాసిక్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కర్ణాటక, కేరళ, అస్సాం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ మంగళవారం భారీ వర్షాలు కురిసాయి.